పూర్తికావస్తున్న మిషన్ భగీరథ పనులు
ఇక ఇంటింటికి చేరనున్న మంచినీరు
ఇమాంపేట వద్ద పనులను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట,ఏప్రిల్20(జనంసాక్షి): మిషన్ భగీరథ పనులు పూర్తి కావస్తున్నాయని, దీంతో ఇక ప్తరి గడపకు మంచినీరు అందనుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇంటింటికి మంచినీరు అందించాలన్న సిఎం కెసిఆర్ కల సాకారం కాబోతున్నదని అన్నారు. నిరంతర విద్యుత్ అందుఉతన్న వేళ ఇక త్వరలో మంచినీటి సమస్యా తీరనుందన్నారు. జిల్లాలోని ఇమాంపేట వద్ద మిషన్ భగీరథ పనులను మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఉదయం జిల్లా కలెక్టర్ కే.సురెంద్రమోహన్ తో కలసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసానికి మిషన్ భగీరథ పథకం ప్రతీక అని పేర్కొన్నారు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 2018 చివరి నాటికి ఇంటింటికి మంచి నీరందించే మిషన్ భగీరథ పథకాన్ని సీఎం కేసీఆర్ చేపట్టడం గొప్ప విషయమన్నారు. మంచినీటి కోసం తెలంగాణా ఆడపడుచులు రోడ్డు ఎక్కోద్దన్నదే ఆయన లక్ష్యమంటూ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి విూడియాతో మాట్లాడుతూ ఈ పథకం పూర్తవ్వడానికి గడువు 2018 చివరి వరకు ఉన్నప్పటికీ అనుకున్నదానికి ముందే పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని చెప్పారు. వేసవిలో ప్రజలకు దాహార్తి సమస్య తలెత్తకుండా ఉండేందుకు పడ్డ శ్రమకు త్వరలోనే ఫలితాలు అందబోతున్నాయాన్నారు. అందులో భాగంగానే మే 5న సూర్యాపేటకు నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ నుంచి అందించనున్న మంచినీటిని సూర్యాపేటకు సవిూపంలోని ఇమాంపేట నీటిశుద్ధి కేంద్రం వద్ద ట్రయల్ రన్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.