పూల ఖర్చు రెండు కోట్లపైనే

విజ్ఞాన్ భవన్ పూల ఖర్చు రెండు కోట్లపైనే
 న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికవుతున్న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ నిర్వహణా ఖర్చుల్లో పూల ఖర్చును చూస్తే కళ్లు తిరిగిపోతాయి. వేదికను అలంకరించడం కోసం గత రెండేళ్లలో 2.29 కోట్ల రూపాయలను పూల కోసం ఖర్చుపెట్టారని సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారం తెలియజేస్తోంది. 2012-2013 వార్షిక సంవత్సరానికి 1,18,41,480 రూపాయలు ఖర్చుచేయగా, 2013-2014 సంవత్సరానికి 1,11,49,550 రూపాయలు ఖర్చయ్యాయి. అంటే రోజుకు సరాసరి 30,540 రూపాయలు పూలపై ఖర్చు చేస్తున్నారు.  నెలకు సరాసరి తొమ్మిదిన్నర లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మొత్తం విజ్ఞాన్ భవన్, లాన్ల నిర్వహణకు నెలకు దాదాపు ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెడుతుండగా, కేవలం పూలపైనే ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం సమంజసమా? అని విజ్ఞుల ప్రశ్న. 1956లో నిర్మించిన విజ్ఞాన్ భవన్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నడుస్తోంది.