పూల రవీందర్‌కు అంత ఈజీ కాదనంటున్న నేతలు


సొంత యూనియన్‌లోనే ఎదురుగాలి
నల్లగొండ,మార్చి4(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికపై ఆయా ఉపాధ్యాయ సంఘాలు దృష్టి పెట్టాయి. 2013నాటి ఎన్నికల్లో ఈ స్థానాన్ని గెలుచుకున్న పీఆర్టీయూ ఈసారి మాత్రం  ఇంటి పోరుతో సతమతమవుతోంది. మరో ప్రధాన ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్‌ గెలుపు ధీమాతో ఉంది. పీఆర్టీయూకు రెబెల్స్‌ బెడద ఉండడం తమకు కలిసొస్తుందన్న అంచనాలో ఆ సంఘ నాయకత్వం ఉంది.  రాష్ట్ర నాయకుడు ఎ.నర్సిరెడ్డి నల్లగొండలో ర్యాలీ నిర్వహించి నామినేషన్‌ దాఖలు చేశారు. మరో ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ టీఎఫ్‌ కూడా పోటీలోకి దిగుతోంది. దీంతో వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా మారుతోంది. తమ సిట్టింగ్‌ స్థానం నిలబెట్టుకునేందుకు పీఆర్టీయూ దృష్టి పెట్టినా, ఆ సంఘంలో నెలకొన్న ఇంటిపోరు అతి పెద్ద సమస్యగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుతో శాసనమండలి సభ్యుడిగా గెలిచిన పూల రవీందర్‌ ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన మరోమారు పోటీ చేయడం కోసం నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. అయితే, అధికార టీఆర్‌ఎస్‌ ఇంకా బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. మరో వైపు అదే సంఘంలో ఈసారి పోటీకి తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టిన రాష్ట్ర నాయకత్వం కూడా ఉంది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వరంగల్‌కు చెందిన నరోత్తం రెడ్డి తాను పోటీలో ఉంటానని ప్రకటించడంతో పీఆర్టీయూలోని ఇంటిపోరు రచ్చకెక్కింది. దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పూల
రవీందర్‌కు గడ్డుపరిస్థితే ఎదురు కానుందని ఆ సంఘం ఉపాధ్యాయులే పేర్కొంటున్నారు.  ఈ నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆయా ఉపాధ్యాయ సంఘాలు బరి లోకి  దిగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ దాకా నా మినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా, శుక్రవారం యూటీఎఫ్‌ తరఫున ఆ సంఘ నాయకుడు నర్సిరెడ్డి నల్లగొండలోనామినేషన్లు దాఖలు చేశారు. రెండో సారి కూడా బరిలోకి దిగుతున్న  ప్రస్తుత ఎమ్మెల్సీ పూల రవీందర్‌కు యూనియన్‌లో కొందరు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. ఆ యూనియన్‌లో జరుగుతున్న పరిణామాలు ఆయనకు ముళ్లబాటగా మారాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసిన కోమటిరెడ్డి నర్సింహారెడ్డి రెబల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఈ పరిణామం సిట్టింగ్‌ ఎమ్మెల్సీకి ఇబ్బందిగా మారడంతో అధికార టీఆర్‌ఎస్‌ నాయకులు జోక్యం చేసుకుని కోమటిరెడ్డి నర్సిరెడ్డిని దారికి తెచ్చుకున్నారని అంటున్నారు. వరంగల్‌కు చెందిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి పోటీలో ఉంటున్నారని, ఆయన సొంతం జిల్లా వరంగల్‌లో ఓట్లు చీలడం ఖాయమని, ఈ పరిస్థితులు సిట్టింగ్‌ ఎమ్మెల్సీ గెలుపుపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.

తాజావార్తలు