పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులుగా నీళ్ళు
మోత్కూరు అక్టోబర్ 1 జనంసాక్షి : మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పాత పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులు నీళ్లు కొడుతున్నారు. ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. వాహనదారులను ఆకర్షించేందుకు 200 రూపాయల పెట్రోల్ కొట్టిస్తే, రెండు కిలోల చక్కెర ఫ్రీ అని, బ్యానర్లు పెట్టి వాహనదారులను ఆకర్షించి, పెట్రోల్ కు బదులు నీళ్లు పోస్తూన్నారు. నీళ్లు కొట్టడం వల్ల వెహికల్స్ రిపేర్ వస్తున్నాయని వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి ఘటనలు బంకుల్లో తరచూ జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో బంకు యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కస్టమర్లు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం మోత్కూర్ పట్టణానికి చెందిన కస్తూరి వెంకటేష్ తన ద్వి చక్ర వాహనంలో పెట్రోల్ కోసమని భువనగిరి రోడ్ లో ఉన్న శ్రీ సంతోషి భవానీ సర్వీస్ ఫిల్లింగ్ స్టేషన్ (పాత పెట్రోల్ బంక్) కు వెళ్లాడు. అక్కడ రూ.100, రూ. 50 వేరు వేరు బాటిల్లో పెట్రోల్ నింపుకోగా పెట్రోల్ బదులు, నీళ్లు వచ్చాయి. ఇదేంటి అని అడిగితే, నిల్లే వస్తాయని, నిర్లక్ష్యం సమాధానం చెబుతున్నారని అన్నారు. ఉదయం నుండి ఈ బంకులో పెట్రోల్ పోయించుకున్న వాహనదారులు అక్కడకు చేరుకొని, బంకు యజమానికి ఫోన్ చేసి నిలదీయడంతో సమాధానం చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని వాహనదారులు తెలిపారు. అధికారులు బంకు యజమానులు అందించే ముడుపులకు అలవాటు పడి, పెట్రోల్ లో నీళ్లు వచ్చిన, కల్తీ జరిగిన, మోత్కూరు పట్టణంలో వున్న బంకులను పర్యవేక్షించడం లేదని ఆరోపించారు. ఇకనైనా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న బంకులపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు పలువురు డిమాండ్ చేశారు.