పెట్రో ధరలపై వామపక్షాల ఉమ్మడి పోరు
9న రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపు
విజయవాడ,జూన్4(జనం సాక్షి): పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామయపక్షాలు మరోమారు చుద్దానికి సిద్దమవుతున్నాయి. ప్రత్యక్ష పోరాటంతో ప్రజలను కలుపుకుని సాగాలని నిర్ణయించాయి. ఇందులో బాగంగా ధరలను తగ్గించాలని కోరుతూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో చేయాలని నిర్ణయించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ ఈ నెల 9న ఉదయం గం 10 నుంచి 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకొకు పిలుపునిచ్చారు.ఆందోళన తప్ప మరో మార్గం లేదని సిపిఎం నేత మధు ప్రకటించారు. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, లారీ ఓనర్స్, ట్యాక్సీ ఓనర్స్, డ్రైవర్స్, పెట్రోల్ బంక్ డీలర్స్, ట్యాక్స్ పేయర్స్, కన్స్యూమర్ అసోసియేషన్స్, ఆటో, ముఠా కార్మికసంఘాలు తదితర సంస్థల ప్రతినిధులు ఏకాబిప్రాయానికి వచ్చాయి. ఉమ్మడిగా ఆందోఎళనకు మద్దతు పలికాయి. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
వసూలు చేస్తున్న పన్నులను సగానికి సగం తగ్గించాలని సమావేశం డిమాండ్ చేసింది. పెట్రో ఉత్పత్తుల్లో అసలు ధర కన్నా పన్నులే ఎక్కువగా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. పెట్రోల్ అసలు ధర రూ.38 కాగా, పన్నులు రూ.48, డీజిల్ అసలు ధర రూ.41 ఉండగా పన్నులు రూ.35 కావడం ఘోరమన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, తెలంగాణాలో కన్నా ఎపిలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్‌పై ఎక్సైజ్ పన్ను 105 శాతం, డీజిల్‌పై 335 శాతం పెంచారన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర తగ్గినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు పెంచడం వల్ల వినియోగ దారులకు పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గలేదన్నారు. మనకన్నా వెనుకబడిన దేశాల్లో కూడా లీటర్ పెట్రోల్ ధర రూ.40 లోపే ఉండగా, మన దేశంలో మాత్రం రూ.84 ఉండడం శోచనీయమన్నారు. మోడీ సర్కారు లీటర్‌కు ఒక్క పైసా తగ్గిస్తే కేరళలో పినరరు విజయన్ ప్రభుత్వం రూపాయి తగ్గించిందన్నారు. ప్రజల ప్రయోజనాల పట్ల వామపక్షాల చిత్తశుద్ధికది నిదర్శనమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల వినియోగ దార్లతో పాటు 55 వేల మంది డీలర్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులను శాతంగా కాకుండా లీటర్‌కు ఇంత చొప్పునని నిర్ణయించాలని కోరారు. కేంద్రం పెట్రోల్ ధరను పైసా తగ్గించడం సిగ్గుచేటన్నారు. పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేరళ తరహాలో పన్నులు తగ్గించాలన్నారు. డీజిల్ ధర పెరగడం వల్ల లారీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందన్నారు. డీజిల్‌పై రూ. 4 తగ్గించమని సిఎం చంద్రబాబును కోరినప్పటికీ ఫలితం లేదన్నారు. కేరళ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఎపిలో ధర తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రవాణా రంగంపై ఆధారపడ్డ 30 లక్షల మంది జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడు కుంటున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు గ్యాస్ ధరలను ప్రభుత్వం భారీగా పెంచుతుందన్నారు.