పెరటితోటల పెంపకంపై అవగాహన
ఆదిలాబాద్,నవంబర్27 (జనంసాక్షి) : అదనపు ఆదాయం కోసం పెరటి తోటల పెంపకంచేపట్టాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వర్‌నాయక్ పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పెరడు భూమి ఉంటుందని, అందులో కూరగాయలు పండించుకుంటే ఆరోగ్యకర మైన ఆహారంతోపాటు ఆదాయం పొందవచ్చని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళికలో భాగంగా మన్నెగూడం ఎస్సీ రైతులకు ఉచితంగా కూరగాయల విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశమై వారికి పెరటి తోటల పెంపకం, ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఆరోగ్య రీత్యా కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల వినియోగం ఇటీవలి కాలంలో పెరిగిందన్నారు. పెరట్లో నాణ్యమైన కూరగాయలను పెంచుకుని ఆరోగ్యంతోపాటు మిగిలిన వాటిని అమ్ముకొని ఆదాయం పొందవచ్చన్నారు. ఇంట్లో వ్యర్థాలను సేంద్రియ ఎరువులుగా వాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా 70 మందికి కాకర, బీర, టమాట, బెండ, పాలకూర, మెంతి, తోటకూర విత్తనాలను ఉచితంగా అందజేశారు.