పెరిగిన టోకు ధరల సూచీ
న్యూఢిల్లీ,మే14(జనంసాక్షి): పెట్రోల్, డీజిల్, కూరగాయలు, పండ్ల ధరలు పెరగడంతో గత నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నెలలో టోకు ద్రవ్యోల్బణం 3.18శాతంగా నమోదైంది. మార్చిలో ఇది 2.47శాతంగా మాత్రమే నమోదు కాగా.. గతేడాది ఏప్రిల్‌లో 3.85శాతంగా ఉంది. మార్చిలో ఆహార పదార్థాల ధరలు 0.29శాతం తగ్గగా.. ఏప్రిల్ నెలలో అవి 0.87శాతం పెరిగాయి. ఇక కూరగాయాల ధరలు మాత్రం 0.89శాతం తగ్గాయి. అంతక్రితం నెలలో కూరగాయల ధరలు 2.70శాతం తగ్గడం గమనార్హం. ఇక ఇంధనం, విద్యుత్ టోకు ద్రవ్యోల్బణం మార్చిలో 4.70శాతానికి పెరగగా.. ఏప్రిల్‌లో నెలలో మరింత పెరిగి 7.85శాతంగా నమోదైంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమనడమే ఇందుకు కారణం. మరోవైపు పండ్ల ధరలు కూడా గత నెలలో 19.47శాతం పెరిగాయని గణాంకాలు పేర్కొన్నాయి.