పెరుగుతున్న చలి తీవ్రత
ఆదిలాబాద్,డిసెంబర్3(జనంసాక్షి): ఓ వైపు ఎన్నికల వేడి పెరుగుతుంటే ఆదిలాబాద్‌లో ఉమ్మడి జిల్లాలో అంతేస్థాయిలో చలి కూడా పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతుల గణనీయంగా పడిపోతున్నాయి. చలి కారణంగా సాయంత్రిం 5 తరవాత బయటకు రాలేకపోతున్నారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో చలి పెరుగుతోంది. మంచు దుప్పటి కమ్మేయడంతో జాతీయ రహదారిపై ఉండే వాహనాలు ఉదయం 8 గంటలకు కూడా లైట్లను వేసుకొని వెళ్లాల్సి వస్తోంది.రోడ్లన్నీ రాత్రి 9 గంటలకే నిర్మాణుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. ఒక వేళ వచ్చినా మంకీక్యాపులు, స్వెటర్లు ధరించి వస్తున్నారు. ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో సాధారణంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఉత్తర భారత దేశం నుంచి దక్షిణ భారత దేశానికి శీతల గాలుల ప్రభావం ఉంటుంది. ఉత్తర భారత దేశంలో ప్రధానంగా రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌ల నుంచి చలిగాలులు వీస్తాయి. నెల రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అస్తమా వ్యాధి గ్రస్తులు చలి నుంచి రక్షణకు ఉన్ని దుస్తులు ధరించి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.