పేగు బంధాన్ని క‌లిపిన‌ వాట్సప్

jldrg538 చెన్నై, సాక్షి ప్రతినిధి: పదహారేళ్ల క్రితం తప్పిపోయిన కుమారుడిని తల్లిదండ్రుల ఒడికి చేర్చింది వాట్సప్. చెన్నై శివారులోని తిరువొత్తియూర్‌లో ఈ ఘటన జరిగింది. తిరువొత్తియూర్‌కు చెందిన దామోదరన్, సుందరి దంపతులకు ఆరుగురు కొడుకులు. పిల్లలతో కలసి దంపతులు 1999లో పుదుచ్చేరిలో ఒక వివాహ వేడుకకు వెళ్లారు. ఆ సమయంలో బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన దామోదరన్ ఐదో కుమారుడు శిగామణి(7) తప్పిపోయాడు. శిగామణి కోసం తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతోపాటు కుమారుడి కోసం కొన్నాళ్లు దామోదరన్ కుటుంబం పుదుచ్చేరిలోనే మకాంవేసి వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు వారు నిరాశతో తిరువొత్తియూర్ చేరుకున్నారు. అయితే పుదుచ్చేరిలో తప్పిపోయిన శిగామణి చెన్నైలోని బేసిన్‌బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఒక అనాథ శరణాలయానికి చేరాడు.

ప్రస్తుతం 23 ఏళ్లొచ్చిన శిగామణి ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఎలాగైనా తల్లిదండ్రులను కలుసుకోవాలనే సంకల్పంతో వాట్సప్‌ను వినియోగించుకున్నాడు. తన వివరాలతో కూడిన ఆడియోను రికార్డు చేసి వాట్సప్‌లో పెట్టాడు. ఈనెల 19న ఈ సందేశం తిరువొత్తియూర్‌లోని కార్తీక్ మొబైల్‌కు చేరింది. అతడు ఈ సందేశాన్ని శిగామణి తల్లికి వినిపించాడు. వెంటనే అతడి తల్లిదండ్రులు వాట్సప్ నంబర్ ద్వారా శిగామణిని సంప్రదించారు. అనంతరం శిగామణి తిరువొత్తియూర్ చేరుకుని తన తల్లిదండ్రులను కలుసుకున్నాడు. ఏడేళ్ల వయసులో తప్పిపోయిన తమ కుమారుడు ప్రయోజకుడై కళ్లముందు నిలవడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.