పేదలకు అందుబాటులో కార్పోరేట్ తరహా విద్య: ఎమ్మెల్యే
మెదక్,ఫిబ్రవరి21(జనంసాక్షి): పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ప్రవేశపెట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమంలో బోధించేలా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం దేశచరిత్రలో ఇప్పటివరకు ఏరాష్ట్రం చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యనందిస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ నిరంతర కృషి చేస్తున్నారన్నారు. 60 సంవత్సరాల ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలపై విద్యార్థి దశ నుంచే ఆసక్తిని పెంచుకోవాలన్నారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నారన్నారు.