పేదలపక్షపాతి సిఎం కెసిఆర్
గోదావరి జలాలతో తీరనున్న ఆలేరు ఆకాంక్షలు: ఎమ్మెల్యే
యాదాద్రి,ఆగస్ట్11(జనం సాక్షి): సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలకు ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరమని అన్నారు. గతంలో పేద కుటుంబాలకు ఆడపిల్లలు పెండ్లిళ్లు భారం కావడంతో తల్లిదండ్రులు అప్పు చేసి పెండిళ్లు చేసేవారన్నారు. కానీ నేడు అలాంటి పరిస్థితులు తలెత్తకుండా సీఎంకేఆర్ ఇంటికి పెద్ద కొడుకులా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు చేపట్టి రూ.1,00,116లను అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆడ పడుచులు నీళ్ల కోసం ఇబ్బందులు పడకుండా మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నల్లా నీటిని అందిస్తున్నారన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లు లేక ఆడపడుచులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రతీ ఇంట్లో కచ్చితంగా మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని, అందుకు ప్రోత్సాహంగా రూ.12 వేలు అందిస్తున్నట్లు తెలిపారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకంతో ఉత్తర తెలంగాణ సస్యశామలం అవుతుందని అన్నారు. కాళేశ్వరంలో భాగంగా ఆలేరు నియోజకవర్గానికి కూడా గోదావరి జలాలు రానున్నాయని అన్నారు. శ్రీరాంసాగర్ రివర్స్ పంపింగ్‌తో రైతాంగానికి భరోసా కలుగుతుందని అన్నారు. కాంగ్రెస్, టిడిపిల వల్ల వట్టిపోయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవ పథకంతో ప్రాణం వస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధించే క్రమంలో రాష్ట్ర రైతాంగం కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టుకు వచ్చిన పథకమే ఇదన్నారు. ఏడాదికి ఈ పథకం పూర్తయి ఎస్సారేస్పీకి పునర్జీవం వస్తుందన్నారు. అందుకే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆకర్షితులై అనేకమంది గులాబీ కండువా కప్పుకుంటు న్నారని అన్నారు. ప్రతి కార్మికుడికి ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని, డబుల్‌బెడ్‌రూం ఇల్లు, సంక్షేమ పథకాలల్లో ప్రాధాన్యత కల్పిస్తామని ఇచ్చారు. పేదల ఆకలి దప్పిక తెలిసిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని,కూడు, గూడు, గుడ్డ, ఆకలి కోసం పోరాటం చేసే కమ్యూనిస్టు సిద్ధాంతం తరహాలోనే నాలుగున్నర కోట్ల ప్రజల గొంతుకను ఒక్కటి చేసి పోరాడి రాష్ట్రం సాధించిన పెద్ద కమ్యూనిస్టు అని అన్నారు. పేదలు, అభాగ్యులు, ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, నిర్వాసితులు, వికలాంగులను ఆదుకోవడం ఎజెండాగా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు.