పేదల ఆకలి తీర్చని ఆర్థికాభివృద్ధి…
అనేక కమిటీలు ఎన్నో నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పేదరికం మరింత పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలో ఆహార భద్రతా చట్టాన్ని చేస్తామని ప్రజలకు హామీనిచ్చింది. మూడేళ్లు గడిడిపోయినా ఆ బిల్లు పార్లమెంట్ గడప దాటలేదు. ఆనాటి హామీ మేరకు మొత్తం దేశమంతటా శాశ్వతంగా కిలో రెండు రూపా యలకు 35 కిలోల బియ్యం ఇవ్వడానికి చట్టాన్ని ఆమోదిం పజేయాలి. ఈలోగా మిగులు ధాన్యాలను అదే ప్రాతిపదికగా ప్రజల కు పంపిణీ చేయాలి. అయితే కోటి టన్నుల ‘మిగులు’ ఆహార ధాన్యాలను పిండి మిల్లులు, బిస్కెట్ తయారీదార్లకు బహిరంగ మార్కెట్లో వేలం ద్వారా అమ్మాలన్న ఇటీవలి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అత్యంత దుర్మార్గమైంది. అమానవీయమైనది. ‘మురిగిపోతున్న ధాన్యాన్ని పేదలకు పంచండి’ అని సర్వోన్నత న్యాయస్థానం ఏనాడో ఆదేశించినా సర్కారుకు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే అయింది. దేశంలోని గోదాముల్లో ఆహారధాన్యాలు పేరుకుపోయిన మాట నిజం. అయితే జనం ముప్పూటలా సుష్టుగా భోంచేసిన తర్వా త కూడా అది మిగిలి ఉందని కాదు. అవసరమైన ఆహారం సామా న్యులు కొకుక్కోలేక పస్తులుంటున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ‘మిగులు’ ఆహార ధాన్యాలు అన్న మాటే ఓ మిథ్య. అందువలన వేలం వేయాలన్న దుర్మార్గ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలి.
‘ఆహారానికి అల్లాడుతున్న దేశం మనది. పట్టెడు మెతు కుల కోసం అమలమటిస్తున్న కోటానుకోట్లమందికి వట్టి మాటలు చెప్పడమంటే అది వారిని వెక్కిరించడమే. ఇంత అన్నం, కొంత గుడ్డ, కొంప ఏర్పరిచి ప్రజలకు చదువు సంధ్యలు చెప్పించి, మందు మాకులు ఇచ్చాక ఎన్ని కబుర్లయినా చెప్పవచ్చు’. స్వాతంత్య్రానికి ముందు నెహ్రూ చెప్పిన మాటలివి. పొయ్యి వెలిగించి, ఎసరెక్కించి, వండివార్చకుండా కేవలం తియ్యటి మాటలతో ఆకలి మంటలు తీరవన్న నెహ్రూ వ్యాఖ్యలు ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత నిజమై నిలుస్తున్నాయి. ప్రభుత్వంలోని అత్యున్నత పీఠా ల్లోని వారు సైతం అవకాశాల్లో అసమానతల గురించి మాట్లా డుతున్నారే తప్ప వాటిని తగ్గించే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. వృద్ధిరేటు విషయంలో దూసుకుపోతున్న భారత్‌లో 44 శాతం మంది పిల్లలు బరువు తక్కువగా ఉండడం దేశానికే సిగ్గు చేటని మన్మోహన్‌సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్లుగా ఈ దేశానికి ప్రధానిగా ఉంటూ, స్వయంగా జాతీయ పౌష్టికాహార మండలికి సారథ్యం వహిస్తున్న వ్యక్తి సమస్యను పరిష్కరించకుండా కేవలం ఇలా సిగ్గుపడడానికే పరిమితం కావడం దేనికి నిదర్శనం? కాలే కడుపుతో అలమటించేవారి సంఖ్యను పెంపొందించడమే వృద్ధికి కొలమానమైతే, ఇక మన్మోహన్ పాలనకు ఎవరూ సాటి రాలేరు. దేశ జనాభాలో సుమారు 68 శాతం అంతర్జాతీయ దారి ద్య్ర రేఖకు దిగువన భారంగా బతుకులీడుస్తున్నారు. వంచవర్ష ప్రణాళికల మౌలిక లక్ష్యమే పేదరిక నిర్మూలన. పదకొండు ప్రణా ళికలు పూర్తయినా, రాజ్యాంగ హక్కైన జీవించే హక్కుకు దిక్కులేని దురవస్థ తాండవిస్తోంది. ఎండుతున్న డొక్కలు, మిన్నకుంటున్న ఆకలి కేకలు వినిపిస్తున్న దౌర్భాగ్య స్థితిలో ‘ఆమ్ ఆద్మీ’కి ఆహార భద్రత కల్పించేందుకు, జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యం.గ్రామాల్లో రోజుకు ఒక మనిషి 2,200 క్యాలరీలు, పట్టణాల్లో 2,100 క్యాలరీలు శక్తినిచ్చే ఆహారం కనీసంగా తినాలని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కానీ, ఆ ప్రమాణాల ప్రకారం ఆహారం తీసుకోలేని వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే మన పట్టణ ప్రాంతాల్లో అలాంటి వారు 1973లో 49.2 శాతంగా ఉండగా, 1993 నాటికి 57 శాతానికి పెరగ్గా 2003కు 73 శాతానికి చేరుకున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో పైన పేర్కొన్న సంవత్సరాల్లో వరుసగా 56.4, 58.5, 75 శాతం ఉన్నారు. పౌష్టికాహారం తీసుకోలేని వారి సంఖ్య ఇంతలా పెరుగుతున్న దుస్థితిలో ప్రభుత్వం సామాన్యులను ఆదుకునే దిశగా ఆలోచించడం మాని సంపన్నులను చంక నెత్తుకుంటోంది. మిగులు ఆహార ధాన్యాల పేరిట వేలం వేయడం ద్వారా వాటిని బడా వ్యాపారులు, కార్పొరేట్ కంపెనీలు కారుచౌకగా కొట్టేస్తాయి. మన ఆహార సబ్సిడీలో గణనీయమైన భాగం గోదా ముల నిర్వహణకే ఖర్చవుతోంది. గోదాముల్లోని మిగులు ధాన్యాలను బహిరంగ వేలం వేయడం అంటే ఆహార సబ్సిడీని కంపెనీలకు కట్టబెట్టడమే అవుతుంది. ఇప్పటికే ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి ఎగబాకింది. తాజాగా పెంచిన డీజిల్ ధరలతో అది మరింత పెరు గుతోంది. ఈ నేపథ్యంలో ఆహార భద్రత మరింత కరువై దారిద్య్రం జడలు విప్పి నాట్యం చేస్తుంది.
నయా ఉదారవాద ఆర్థిక విధానాలు నచ్చక ఏపీఎల్, బీపీఎల్ అంటూ ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయి. ఈ విధానాలు అమలులోకి వచ్చిన 1991లో దేశమంతటా పీడీఎస్ ద్వారా రెండు కోట్ల పది లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేశారు. ఆ ఏడాది మార్కెట్లోకొచ్చిన ఆహార ధాన్యాల్లో అది 45 శాతం. పదేళ్లు గడి చేసరికల్లా 2001లో పీడీఎస్ ద్వారా పంపిణీ అయిన ఆహార ధాన్యాలు దాదాపు సగానికి అంటే కోటీ ముప్పై లక్షల టన్నులకు దిగజారాయి. ఈ పుష్కర కాలంలో అది మరింత క్షీణించింది. పేదరి కాన్ని తగ్గించలేని కేంద్ర ప్రభుత్వం పేదల సంఖ్యను తగ్గించేలా దారిద్య్ర రేఖ నిర్వచనాన్ని కుదించేస్తోంది. దానికి రకరకాల కొల బద్ధలను నిర్ణయిస్తూ గందరగోళం సృష్టిస్తోంది. రోజుకు వచ్చే ఆదా యం ప్రాతిపదికగా దారిద్య్ర రేఖకు ఎగువన, దిగువన అంటూ విడదీస్తోంది. వాస్తవానికి పేదరికాన్ని రోజుకు తీసుకునే ఆహారం ప్రతిపదికగా నిర్ణయించడం హేతుబద్ధమవుతుంది.ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్‌ఐ) ప్రకారం తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొంటున్న ప్రపంచంలోని 80 దేశాల్లో భారత్ 67వ స్థానంలో ఉంది. ప్రపంచంలో ఆకలితో బాధపడుతున్న వారిలో 25 శాతం మంది (దీన్ని అంగీకరించాల్సి రావడం సిగ్గుచేటైన విషయం) భారతీ యులున్నారు. ఈ విషయంలో ఉత్తర కొరియా, అంతర్గత కలహాల తో తల్లడిల్లుతూ విడిపోయినా సూడాన్ కంటే కూడా భారత్ దిగువ ర్యాంక్‌లో ఉంది. ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధ పడుతున్న ఐదేళ్లలోపు వయస్సున్న వారు మూడింట రెండు వందుల మంది భారత్‌లో ఉన్నారు. భారత దేశంలో 44 శాతం మంది పిల్లలు నిర్ణీత ప్రమాణం కంటే తక్కువ బరువుతో ఉన్నారు. 72 శాతం మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. 52 శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడడం ఘోరమైన విషయం. వారు భారత భవిష్యత్ తరానికి జన్మనివ్వనున్నారు. నివారించదగ్గ వ్యాధు లతో ఆరత దేశంలో ప్రతిరోజూ వేలాది మంది బాలలు మరణి స్తున్నారు. ఇవి బాధకరమైన, కఠోరమైన, దాచేస్తేదాగని సత్యాలు. ఈ నేపథ్యంలో రూపొందించిన ‘ఆహార భద్రత బిల్లు-2011’ ఎందుకు కొరగాకుండా పోయింది. ఉచిత మధ్యాహ్న భోజనం, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఆరు మాసాల పాటు వండిన ఆహారం పెట్టడం, ఏ ఆధారం లేని వ్యక్తులు, వలస కార్మికులు, ఆకలిగొన్న వారికి కమ్యూనిటీ కిచెన్‌లు తదితర సానుకూల అంశాల నుంచి కేంద్రం తప్పుకోవాలని చూసే ప్రతిపాదనలు బిల్లులో చోటు చేసుకున్నాయి.
ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) లెక్కలయితే ప్రభుత్వానికి మరీ ఆశాభంగం కలిగిస్తాయి. ఆసియాలో సగటు ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని ఏడీబీ రోజుకు 1.35 డాలర్లను కనీస ఆదాయంగా నిర్ణయించింది. దీని ప్రకారం 2005లో భారత దేశంలో పేదల సంఖ్య 62 నుంచి 74 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఆసియాలో ఒక్క నేపాల్ తర్వాత పేదల శాతం అత్యధి కంగా ఉన్న రెండో దేశంగా భారత్‌ను ఏడీబీ గుర్తించింది. నేపాల్‌లో పేదల శాతం 55.8శాతం కాగా, భారత్‌లో 54.8 శాతం, బంగ్లా దేశ్‌లో 42.9 శాతం, కంబోడియాలో 36.9 శాతం, భూటాన్‌లో 31.8 శాతం, ఫిలిప్పైన్స్‌లో 29.5 శాతం, వియాత్నాంలో 16 శాతం, శ్రీలంకలో 9.9 శాతం పేదలున్నట్లు ఏడీబీ గుర్తించింది. ఏడీబీ అంచనాల ప్రకారం భారత దేశం యూఎన్‌డీపీ లక్ష్యంగా పెట్టినట్లు 2015 నాటికల్లా 1990 నాటి పేదరికంలో సగాన్ని తగ్గించాలంటే, ఏడాదికి 2 శాతం చొప్పున పేదల శాతం తగ్గాల్సి ఉంటుంది. ప్రస్తుత ధోరణి చూస్తే అలా తగ్గడం అసాధ్యమని పిస్తుంది.
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూన్‌డీపీ) మానవాభివృద్ధి నివేదిక-2011 ప్రకారం ఇండియాలో 53.7 శాతం లేదా 61.2 కోట్ల పేదలున్నారు. దాన్ని బట్టి చూస్తే ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పేదలు ఉన్న దేశం ఇండియానే. పేదల్లోనూ 28.6 శాతం కటిక దారిద్య్రం అనుభవిస్తున్నారని ఆ నివేదిక తేల్చి చెప్పింది. 185 దేశాల మానవాభివృద్ధి సూచి 2011లో భారత్ స్థానం 134. మానవాభివృద్ధికి సంబంధించిన మూడు మౌలిక అంశాలు (ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవనం, మేధో వికాసం, మెరు గైన జీవన ప్రమాణాలు) పరిగణలోకి తీసుకొని రూపొందించిన సూచి ఇది. ఐక్యరాజ్యసమితి బాలల నిధి (యూనిసెఫ్) ప్రకారం భారతీయుల్లో సగం మంది పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. ప్రపంచంలో పోషకాహార లేమితో బాధపడుతున్న వారిలో 29 శాతం మంది ఇండియాలోనే ఉన్నారని ఆహార వ్యవ సాయ సంస్థ (ఎఫ్‌ఏఐ) పేర్కొంది. దేశంలో ఆరు నుంచి 35 నెలల వయోవర్గంలోని పిల్లల్లో 78.9 శాతం రక్తహీనతతో బాధ పడు తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో అలాంటి బాలల సంఖ్య 80.9 శాత మని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. 15 నుంచి 49 ఏళ్లలోపు వివాహిత మహిళల్లో 56.2 శాతం రక్తహీనతను ఎదు ర్కొంటున్నారని తెలిపింది. దేశంలో పేదరికం ఎంత విస్తృతంగా ఉందో చాటి చెబుతున్న గణాంకాలివి, కాగా ప్రభుత్వ తోడ్పాటు అవసరమైన ప్రజల సంఖ్య తక్కువగా ఉందనడం ద్వారా సంక్షేమ పథకాల వ్యయాన్ని బాగా తగ్గించుకోవాలన్నది దాని వ్యూహం. ప్రజల జీవన పరిస్థితుల్ని మెరుగుపరచడం కన్నా, ద్రవ్యలోటు తగ్గిం చుకోవడానికే సర్కారు ప్రాధాన్యం ఇస్తోంది.1957 గుల్జారీ లాల్ నందా అధ్యక్షతన జరిగిన పదిహేనో కార్మిక సదస్సులో మొట్ట మొదటిసారిగా దారిద్య్రరేఖ అనే భావనను తెరపైకి తెచ్చారు. ప్రణాళిక సంఘం కార్యాచరణ బృందం 1962లో ఈ భావనను ఆమోదించింది. వ్యక్తులు ఆరోగ్యకరంగా జీవించడానికి కావలసిన కనీస ఆళహారం తదితర వస్తు పదార్థాలను దారిద్య్ర అంచనాకు ప్రాతిపదికగా తీసుకున్నారు. 1960-61 నాటి ధరల ప్రకారం ఒక వ్యక్తి వినియోగ పదార్థాల కోసం నెలకు రూ.20 కానీ, అంతకన్నా తక్కువకానీ వ్యయం చేస్తే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు గుర్తించింది. కుటుంబ వ్యయాన్ని ప్రాతిపదికగా తీసుకుని దారిద్య్ర రేఖ నిర్వచనాన్ని బట్టి పేదల సంఖ్యను నిర్ధారించారు. వైకె అలఘ్ కమిటీ (1977) లక్డావాలా కమిటీ (1989) దారిద్య్రరేఖపై అధ్యయనం జరిపాయి. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం పేదరికం ప్రమాణాల నిర్ధారణకు 2005లో ఏర్పాటు చేసిన సురేశ్ టెండూ ల్కర్ కమిటీ నాలుగేళ్ల తర్వాత 2009లో తన నివేదిక సమర్పించింది.ప్రాతిపదిక మారినప్పుడల్లా పేదల సంఖ్యను ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చారు. పేదరికం బాగా తగ్గిందని పాలకులు అంటున్నప్పటికీ, పేదరికాన్ని లెక్కించడానికి తీసుకొన్న ప్రాతిపదిక, విశ్వసించలేని గణాంక వివరాల కారణంగా తీవ్ర విమ ర్శలు ఎదురవుతున్నాయి. పేదల జీవన పరిస్థితులు ఎంతమాత్రం మెరుగు పడకపోయినప్పటికీ, ప్రభుత్వం వారి సంఖ్యను తెగ్గోసి చూపిందని ప్రజలకు అర్థమైంది. 2009-10లో దేశ జనాభాలో పేద సంఖ్య 29.8 శాతమేనన్న తాజా అంచనా మరింతగా విమర్శల పాలైంది. కళ్లకు కనిపించే వాస్తవాలకూ, ఈ లెక్కలకూ ఏమాత్రం పొసగడం లేదన్నది ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఆ నిపుణులు మాత్రం ఏవేవో సిద్ధాంతాలను, సూత్రాలను వల్లెవేస్తూ పేదరికం తగ్గుతూ వస్తున్నదని అంటున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం వాటినే ప్రాతిపదికగా తీసుకుం టున్నది.అవకాశాల నిరాకరణ జాతి పురోగతిని ఆపివేస్తుందన్నది అందరూ అంగీకరించిన వాస్తవం. ఒక వ్యక్తి తనకు అవసరమైన, ఇష్టమైన జీవన విధానాన్ని ఎంపిక చేసుకునే అవకాశం లేని పరిస్థి తినే పేదరికంగా భావించాల్సి ఉంటుంది. పేదరికాన్ని తగ్గించి, దేశ ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా పేదరికపు లెక్కలను తగ్గించి చూపడానికి ప్రయత్నిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 2,200, పట్టణ ప్రాంతాల్లో 2,100 కేలరీల కంటే తక్కువ పోషక విలువలున్న ఆహారం తింటున్న వారు 75 శాతం ఉన్నారని ఒకవైపు చెబుతూనే మరోవైపు డబ్బు రూపంలో ఆదాయపు పన్ను పరిమితిని నిర్ధారించడం ద్వారా పేదరికం తగ్గిందని చెప్పడానికి దొంగనాటకం ఆడుతోంది. రోజుకు గ్రామాల్లో రూ.22, పట్టణాల్లో రూ.28 మొత్తాన్ని పేదరికానికి గీటురాయిగా ప్రభుత్వం నిర్ణయించింది. అంతకన్నా ఎక్కువ సంపాదించేవారు పేదలు కాదని ప్రణాళిక సంఘం అంటోంది. ప్రణాళికా సంఘం నిర్ధారించిన 22, 28 రూపాయలతో రోజుకు 1,800 కేలరీల పోషక విలువలున్న ఆహారాన్ని పొందడం కూడా కూడా కష్టమే! ఇక కనీస ఆహార భద్రత ఎక్కడ? పేదరికపు ప్రమాణాలను అలా అర్థం పర్థం లేకుండా తగ్గించి గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతానికి, పట్టణ ప్రాంతంలో 21 శాతానికి పేదరికం తగ్గిందని సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది.
సామాజిక భద్రత కల్పించడాన్ని నైతిక బాధ్యతగా గుర్తించిన దేశాలకు చెందిన ప్రజలు విద్య ఆరోగ్యం, జీవన ప్రమాణాలపరంగా అత్యున్నత స్థాయిల్లో ఉన్నాయని ప్రపంచ నివేది కలు తెలియజేస్తున్నాయి. కొద్ది నెలల క్రితం ప్రణాళిక సంఘం పేదరిక రేఖ గురించి పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ.32, గ్రామీణ ప్రాంతాల్లో రూ.26 తలసరి ఆదాయం మించి ఒక రూపాయి పొందినా వారు పేదల కిందకు రారని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పట్ల ప్రజల్లోనూ, నిపుణుల్లోనూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావడంతో ఇప్పుడు కొత్తగా మరో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడు సి. రంగరాజన్, నేతృత్వంలోని ఈ కమిటీలో మరో నలుగురు సుభ్యులు న్నారు. ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ మహేంద్రదేవ్, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీకి చెందిన కె. సుందరం, మహేశ్ వ్యాస్, ప్రణాళిక సంఘం మాజీ సలహాదారు కేఎల్ దత్తా ఈ కమిటీలోని ఇతర సభ్యులు, ఇలాంటి హేమాహేమీలతో ఏర్పడిన కమిటీ తన పనిని సమర్థవంతంగా నిర్వహించి వాస్తవానికి అద్దం పడుతుందా? గతంలో పేదరిక రేఖను నిర్ణయించిన వారు కూడ ఎంతో పేరు ప్రఖ్యాతులున్నవారే. అయినా పేదరికానికి వారు రూపొందించిన కొలబద్దలు, వాటి ఆధారంగా వేసిన అంచనాలు ఏమాత్రం విశ్వసనీయంగా లేవని రుజవయింది.నూతన కమిటీ ఏర్పాటును ప్రకటించే సమయంలో కేంద్ర ప్రణాళిక సహాయమంత్రి అశ్వనీ కుమార్ మాటలు గమనిస్తే అలాంటి ఆశలకు తావుండదేమో అనిపిస్తుంది. పేదరికాన్ని అంచ నా కట్టే పద్ధతులను మార్చుకోవాలని చెబుతూనే అలాంటి పరిస్థితికి దారితీసిన పరిస్థితుల గురించి ఆయన చెప్పిన ధోరణి ఎగతాళి చేసినట్టుగా ఉంది తప్ప చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించదు. నేడు పేద రికం పట్ల అవగాహనలోనే పెద్ద మార్పు వచ్చింది. ‘ఇరవై పైసలు పెట్టి పోస్టుకార్డు రాసే బదులు మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రీబాక్ జోళ్లు ధరిస్తున్నారు. సైకిళ్లకు బదులు స్కూటర్ల పై ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు సమస్య రోటీ, కపడా, మకాన్ కదు, రీబాక్‌లు, సెల్‌ఫోన్లు’ అని ఆయన మాట్లాడుతున్నాడంటే ప్రభుత్వం పేదల పట్ల ఎంత చిన్నచూపుతో ఉందో అర్థం చేసుకోవచ్చు. పేదవారికి అర్థ, తాత్పర్యాల కోసం ప్రభుత్వం సాగిస్తున్న అన్వేషణకు ఇప్పట్లో తెరపడే అవకాశం లేదని ఆయన మాటలతో మరోమారు రుజువైంది.పేదరికం అంటే ఏమిటో దేశంలో ఎంతమంది దాంతో బాధ పడుతున్నారో ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. ప్రభుత్వం ఇన్నాళ్లుగా జబ్బేమిటో తెలుసుకోకుండానే చికిత్స చేస్తోంది. దారిద్య్రమంటే ఏమిటో, దాని తీవ్రత ఎలాంటిదో, ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స చేయాలో దానికి అర్థం కావడం లేదు. అందుకే, దారిద్య్ర నిర్మూలనకు సమర్థ విధానాలు రూపొందించ లేకపోయింది. పేదరికం పై ప్రభుత్వం అధికారిక అంచనాలకు, అనేక మంది స్వతంత్ర నిపుణుల అంచనాలకు అసలు పోలికే ఉండ డం లేదు. జాతీయ శాంపుల్ సర్వేలాంటి వాటి ఆధారంగా వేసే లెక్కలు సైతం పేదరికం ప్రభుత్వం అంచనాల కన్నా కన్నా చాలా ఎక్కువగా ఉన్నదని చెబుతున్నాయి. తాజా జాతీయ శాంపుల్ సర్వే ప్రకారం పేద ప్రజలు మొత్తం జనాభాలో 77 శాతం ఉంటారు. దేశం మొత్తం మీద కేవలం 23.5 కోట్ల మంది మాత్రమే కనీస ఆదాయాన్ని పొందుతున్నారు. 83.5 కోట్ల మందికి ప్రభుత్వ సహా యం అవసరమవుతుంది.
ఆర్థికాభివృద్ధిపై గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి ఆకలిని తీర్చడంలో ఘోరంగా విఫలమైంది. సామాన్యుడి ఆకలి పరిస్థితి 1996లో ఏ విధంగా ఉందో ఇప్పుడు అలాగే ఉందని తాజాగా విడుదల చేసిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్‌ఐ) కుండబద్దలు కొట్టింది. సామాన్యుని ఆకలి తీర్చే విషయంలో ఇథియోపియా కంటే భారత్ పరిస్థితి ఘోరంగా ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. మన పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌ల కన్నా వెనుకబడి ఉన్నామని అంతర్జాతీయ ఆహార విధానాల పరిశోధన సంస్థ (ఐఎఫ్‌ఆర్‌ఐ) రూపొందించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. భారత్ విశేష ఆర్థికాభివృద్ధిని సాధించినప్పటికి సామాన్యుడి ఆకలి తీర్చడంలో వెనుకబడివుండడం శోచనీయం. భారత్‌లో గత రెండు దశాబ్దాల కాలంలో తలసరి ఆదాయం రెట్టింపు అయినా హంగర్ ఇండెక్స్‌లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని నివేదిక తేల్చి చెప్పింది. దేశంలో మూడింట రెండొంతుల మంది ఆకలితో అలమటి స్తున్నారని నివేదిక పేర్కొంది. ఆర్థికాభివృద్ధి, ఆకలి పోరుకు మధ్య అంతరం నానాటికి విస్తరిస్తోందని ఈ నివేదిక వ్యాఖ్యానిం చింది.సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల నివేదిక 2012 తాజాగా గుండెలవిసే నిజాలు బయట పెట్టింది. ‘పారిశుధ్యం’ ఆహార భద్రత, కాన్పు సమయంలో తల్లుల మరణాలు, స్త్రీ పురుష అసమానతలకు సంబంధించి భారత్ పరిస్థితి రోజురోజుకూ అన్యాయంగా తయార వుతోందని నివేదిక కుండబద్దలు కొట్టింది. పేదరిక నిర్మూలన దిశగా అనుసరిస్తున్న అపసవ్య పద్ధతులను మార్చు కోనిపక్షంలో 2015 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరు కోవడం అసాధ్యమని నివేదిక స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో ప్రజల ందరికీ ఆహార భద్రతను సమకూర్చాలంటే ప్రభుత్వ విధానాల్లో గణనీయమైన మార్పు రావాలి. ఆహార పంటల సాగును ప్రోత్సహిం చాలి. రైతాంగానికి అవసరమైన సేంద్రియ ఎరువులను, పురుగు మందులను సాధ్యమైనంత తక్కువ ధరలకు అందుబాటులో ఉంచాలి. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం మార్కెట్‌లో ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువగా జోక్యం చేసుకోవాలి. ఎఫ్‌సీఐ వంటి ప్రభుత్వరంగ సంస్థల చేత ఆహార ధాన్యాలను సాధ్యమైనంత ఎక్కువగా కొనుగోలు చేయించాలి. లక్షిత సబ్సిడీ వ్యవస్థకు బదులుగా సార్వత్రిక ప్రజాపంపిణీ వ్యవస్థను ఆచరణలోకి తీసుకో వాలి. నగదు బదిలీ పథకాల ఆలోచనను కూడా మాను కోవాలి. గ్రామీణ ఉపాధి హామీని మరింత విస్తృతంగా అమలు చేయడంతో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధికి గ్యారంటీ ఇవ్వాలి.
ఏ దేశమైనా ఆహార భద్రత సాధించడమన్నది దీర్ఘకాలిక ప్రణాళికతో నిష్టగా నిర్వర్తించాల్సిన కర్తవ్యం. ఉత్పత్తి సేకరణ, నిల్వ, రవాణా, పంపిణీ తదితర అంశాలతో ముడిపడిన చిక్కు సమస్యలెన్నింటినో పరిష్కరిస్తేనే తప్ప సరైన పరిష్కారం దుర్లభం. ప్రతి ఒక్కరికీ ఆహారభద్రత కల్పించడం కోసం దేశంలో రెండో హరిత విప్లవానికి పాటు పడాలని ఆర్థిక సర్వే నిరుడు పిలుపు నిచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 17 కోట్ల హెక్టార్ల సాగు భూమి 10 కోట్ల హెక్టార్లకు తగ్గిపోనుంది. అందువల్ల పరిమిత వనరులతోనే రెట్టింపు ఉత్పాదకతను చేరుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు దశాబ్దం క్రితమే హితవు పలికారు. రాష్ట్రాలవారీగా ఇప్పటి అవసరాలు తీర్చడంతో పాటు పెరిగే జనాభాకు దీటుగా ఇతోధిక దిగుబడుల సాధనకు విత్తనాల నాణ్యత, సమర్థ నీటి నిర్వహణ, భూసారం పెంపుదల అత్యంత కీలకం. వాటిని యూపీఏ జమానా గాలికొదిలేసింది. రసాయన ఎరువుల విచ్చలవిడి వాడకం మూలాన కోటీ 20 లక్షల హెక్టార్ల భూములు నిస్సారమైపోయాయి. భాస్వరం, నత్రజని, పొటాషియం లోపాలు, నీటిముంపు, భూక్షారం వల్ల పంటల ఉత్పాదకత దినదినం దెబ్బతినిపోతోంది.
1991 నుంచి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వేగం పెరిగింది. ఆహార వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరుతున్నందునే దేశంలోని పౌరులందరికీ ఆహార భద్రతా చర్యలను పటిష్ట పరచవలసిన అవసరమున్నది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో బడా సంపన్నవర్గాల వాటా రాను రానూ తగ్గిపోతోంది. కానీ ప్రజలకు ఇచ్చే సబ్సిడీ ఒక్క రూపాయి పెరిగినా బోలెడంత చర్చ చేస్తారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలు పేదరికాన్ని మరింత పెంచడంతో పాటు అసమానతలు మరింత పెంచడానికి ఆజ్యం పోస్తున్నాయి. ఒ పక్కన కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ, మరోపక్క పేదవాడికి ఇచ్చే రాయితీలు కుదిస్తున్నారు. పేదరికాన్ని తుడిచి పెడతామన్న బడాయి మాటలకే పరిమితమైంది. ఇది పాలకులవర్గ నైజాన్ని బయట పెడుతుంది. పేదరికమన్నది మన దేశంలో ఎన్నికల ముడి సరుకుగా మారిపోయింది.పోషకాహార లోపాలు, శిశు మరణాలు, తామరతంపరగా పుట్టుకొస్తున్న మురికివాడలు.. ఇవన్నీ విస్తరిస్తున్న దారిద్య్రానికి నిలువెత్తు నిదర్శనాలు. అసమానతలు పెరగ డమేకాదు.. ప్రజల జీవన పరిస్థితులు క్షీణిస్తుండడం ఆందోళన కలిగించే విషయం. కానీ బడా కార్పొరేట్లు, పాలక రాజకీయవేత్తలు, ఉన్నత అధికార కూటమి ఈ ముగ్గురూ కలిసి లక్షల కోట్లు దేశ సంపదను కొల్లగొడుతున్నారు. లక్షల కోట్ల రూపాయల పన్నులు ఎగవేస్తూ పన్ను రాయితీలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి కుటుంబానికి కిలో రెండు రూపాయలు మించకుండా నెలకు 35 కిలోలు చొప్పున ఆహార ధాన్యాలు పొందే సార్వత్రిక హక్కు ఉందనీ, పప్పుధాన్యాలు, వంట నూనెలు, పంచదార వంటి నిత్యావసర సరుకులు కూడా పీడీఎస్ ద్వారా సబ్సిడీ ధరలకు సరఫరా చేయాలన్న ప్రజాడిమాండ్ న్యాయ సమ్మతమైంది. అందువలన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకలితో అలమటించరాదనుకుంటే ప్రజలను దారిద్య్ర రేఖకు దిగువకు నెట్టివేస్తున్న పాలకుల విధా నాలకు వ్యతిరేకంగా ఆకలి, పేదరికంలేని మెరుగైన భారతదేశాన్ని నిర్మించే దిశగా సంఘటిత ప్రజా ఉద్యమాలు నిర్మించాలి.
– ఎ. నర్సింహారెడ్డి.
(రచయిత ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు)
వీక్షణం సౌజన్యంతో…