పేదింట్లో చీకట్లే

50 యూనిట్లు వాడే కరెంటు చార్జీల్లో 79.31% పెంపు
పెంచలేదని చెపుతూనే పేదలపై చార్జీల బాదుడు
ప్రస్తుతం రూ. 72.5 చెల్లించేవాళ్లు ఇకపై రూ. 130 కట్టాల్సిందే
500 యూనిట్ల విద్యుత్‌ వాడే వారికి 18.15 శాతమే పెంపు
తాజా చార్జీల పెంపుతో వినియోగదారులలో 90% మందిపై భారం
జనంసాక్షి, హైదరాబాద్‌ : పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, వారిపై ఏవిధంగానూ భారం పడనివ్వబోమని చెబుతున్న ప్రభుత్వం అసలు రంగు. కరెంటు చార్జీల విషయంలోనూ తేటతెల్లమైంది. 2013-14 సంవత్సరానికి గృహ వినియోగదారులకు సంబంధించిన విద్యుత్‌ చార్జీల పెంపుదలలో…వాస్తవానికి పేదలపైనే సర్కారు పెనుభారం మోపింది. కాంట్రాక్టు లోడ్‌ మాయాజాలంతో 50 యూనిట్లు వినియోగించే పేదలకు ఏకంగా 79.31 శాతం మేరకు విద్యుత్‌ చార్జీలు పెంచింది. అలాగే మధ్యతరగతినీ వదల్లేదు. 100 యూనిట్ల నుంచి 200 యూనిట్లలోపు వినియోగించే మధ్యతరగతి ప్రజలపై 44.44 శాతం నుంచి 31.93 శాతం వరకూ భారం మోపింది. అదే 500 యూనిట్లు వాడే పెద్దలకు మాత్రం కేవలం 18.15 శాతం పెంపుదలతోనే సరిపుచ్చింది.
పేదలపై భారాన్ని ఒకసారి పరిశీలిస్తే… కాంట్రాక్టు లోడ్‌ 500 వాట్ల కంటే ఎక్కువగా ఉండి 50 యూనిట్లు వాడితే ప్రస్తుతం చెల్లిస్తున్న కరెంటు బిల్లు (సర్వీసు, సర్దుబాటు చార్జీలను మినహాయించి) రూ. 72.50. ఇదే వినియోగదారుడు తాజాగా పెరిగిన విద్యుత్‌ చార్జీల వల్ల ఏకంగా రూ.130 కట్టాల్సి రానుంది. అంటే ఈ తరహా వినియోగదారులకు ఏకంగా 79.31 శాతం మేరకు విద్యుత్‌ చార్జీలు పెరిగాయన్నమాట. అదేవిధంగా 500 వాట్ల కంటే తక్కువగా లేదా ఎక్కువగా కాంట్రాక్టు లోడ్‌ ఉన్న ఏ వినియోగదారుడైనా నెలకు 51 యూనిట్లు వినియోగిస్తే ప్రస్తుతం చెల్లించే బిల్లు రూ. 75.10. ఇదే వినియోగదారుడు పెరిగిన చార్జీల వల్ల ఏకంగా రూ. 133.25 చెల్లించాల్సి రానుంది. ఈ పెరుగుదల శాతం ఏకంగా 77.43 ఇక నెలకు 500 యూనిట్లు వినియోగించే గృహ వినియోగదారుడు ప్రస్తుతం చెల్లిస్తున్న బిల్లు మొత్తం రూ. 2,545 అయితే, తాజా పెరుగుదల వల్ల ఇతను చెల్లించాల్సిన కరెంటు బిల్లు రూ.3,007. పెరుగుదల శాతం కేవలం 18.15 మాత్రమే.
90 శాతం మందికి పెరుగుదల!


సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త విద్యుత్‌ చార్జీల వల్ల గృహ వినియోగదారులో 90 శాతం మందికి షాక్‌ తగలనుంది. కాంట్రాక్టు లోడ్‌ పేరిట ప్రభుత్వం చేసిన కనికట్టే ఇందుకు ప్రధాన కారణం. 50 యూనిట్లలోపు వారికి చార్జీలు పెంచలేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇది వాస్తవం కాదు. 500 వాట్ల కంటే ఎక్కువ కాంట్రాక్టు లోడ్‌ ఉన్న గృహ వినియోగదారుడు 50 యూనిట్లకు ప్రస్తుతం రూ.72.50 చెల్లిస్తుంటే…. ఈనెల నుంచి యూనిట్‌కు రూ.2.60 చొప్పున రూ. 130 చెల్లించాల్సి రానుంది. అదేవిధంగా 500 వాట్స్‌ కంటే తక్కువ కాంట్రాక్టులోడు ఉన్న పేదలు ప్రస్తుతం 51 యూనిట్లకు రూ.75.10 చెల్లిస్తుండగా, ఇక నుంచి రూ.133.25 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.58.15 పెరిగిందన్న మాట రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది గృహ వినియోగదారులు ఉండగా.. కోటి 80 లక్షల మంది మీద

కరెంటు చార్జీల పెరుగుతదల భారం పడనున్నట్లు అంచనా. అంటే 90 శాతం మంది గృహ వినియోగదారులకు కరెంటు బిల్లు షాక్‌ కొట్టనుందన్న మాట.వాస్తవం ఇలావుంటే ప్రభుత్వం మాత్రం 97.4 లక్షల మందికి చార్జీల పెరగలేదని పేర్కొంటూ అడ్డంగా బుకాయిస్తోంది. 500 వాట్ల లోపు కాంట్రాక్టు లోడ్‌ అలాగే 50 యూనిట్లలోపు వాడకం ఉన్న వినియోగదారులు కేవలం 20 లక్షల మంది మాత్రమే. వీరికి మాత్రమే చార్జీలు పెరగలేదు.
కాంట్రాక్టు లోడ్‌ అంటే..
కాంట్రాక్టు లోడ్‌ పేరిట ప్రభుత్వం పేదలపై కనిపించని భారీ భారం మోపింది. 50 యూనిట్లలోపు వారికి (యూనిట్‌కు రూ.1.45 చార్జీ) పెంచలేదని పేర్కొంటూనే కాంట్రాక్టు లోడ్‌ 500 వాట్లు దాటినవారికి మాత్రం 50 యూనిట్లలోపు వినియోగించినప్పటికీ యూనిట్‌కు రూ.2.60 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. కాంట్రాక్టు లోడ్‌ అంటే… మీ ఇంట్లో ఉన్న విద్యుత్‌ ఉపకరణాల మొత్తం సామర్థ్యాన్ని కలిపితే వచ్చే మొత్తాన్నే కాంట్రాక్టు లోడ్‌గా వ్యవహరిస్తారు. ఉదాహరణకు మీ ఇంట్లో ఒక టీవీ, రెండు ట్యూబ్‌ లైట్లు, ఒక ఫ్యానుతో పాటు మిక్సీ ఉందనుకోండి. మీ కాంట్రాక్టు లోడ్‌ సామర్థ్యం 500 వాట్లు దాటిపోతుంది. అదెలాగంటే… టీవీ సామర్థ్యం -100 వాట్లు, ట్యూబ్‌లైట్‌ సామర్థ్యం -40 వాట్లు, ఫ్యాను సామర్థ్యం -60 వాట్లు, మిక్సీ సామర్థ్యం- 500 వాట్ల నుంచి 1000 వాట్ల వరకూ ఉంది. మిక్సీకి సంబంధించి 500 వాట్ల కనీస సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మీ ఇంట్లో ఉన్న విద్యుత్‌ ఉపకరణాల సామర్థ్యం మొత్తం 740 వాట్లవుతుంది. అంటే మీ కాంట్రాక్టు లోడ్‌ సామర్థ్యం 500 వాట్లను దాటిపోయిందన్న మాట. దీనివల్ల ఇక మీదట మీరు 50 యూనిట్లు వాడుకున్నా ప్రతి యూనిట్‌కు రూ.1.45 కాకుండా రూ.2.60 చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా 50 యూనిట్లే వాడుకున్నప్పటికీ మీకు కూడా విద్యుత్‌ షాక్‌ తగులుతుందన్న మాట.

తాజావార్తలు