పేద ముస్లింలకు భరోసా

బట్టలు, బియ్యం, సరుకులు పంపిణీ చేసిన మంత్రి

సిద్దిపేట,జూన్‌4(జ‌నం సాక్షి ): తెలంగాణ వచ్చిన తరవాతనే అన్ని వర్గాలకు మేఉలు జరిగేలా కార్యక్రమాలు చేపట్టామని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కులాల వారీగా, వర్గాల వారిగా కులవృత్తులకు ప్రోత్సాహం ఇస్తూనే సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నామని అన్నారు. అలాగే తెలంగాణ ముస్లింలందరికీ భరోసా వచ్చిందన్నారు. గజ్వేల్‌ -ప్రజ్ఞాపూర్‌ లోని ప్రజ్ఞ గార్డెన్స్‌లో సోమవారం ఉదయం రంజాన్‌ మాసం సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు బట్టలు, బియ్యం, సరుకులు పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి వెంట మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌ రెడ్డి, ఫారూఖ్‌ హుస్సేన్‌, గడ ప్రత్యేక అధికారి ఎం.హన్మంతరావు, ఆర్డీఓ విజయేందర్‌ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రముఖ ఆర్‌ఆర్‌ కంపనీ ఛైర్మన్‌ సయ్యద్‌ హావిూద్‌, ఇమ్రానోద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్‌ నగర పంచాయతీ పరిధిలోని పేద ముస్లింల వెయ్యి మంది కుటుంబాలకు బట్టలు, 425 మంది కుటుంబాలకు బియ్యం, సరుకులను మంత్రి హరీశ్‌ రావు చేతుల విూదుగా పంపిణీ చేశారు. అలాగే గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 200 మందికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముస్లింలకు సహాయం చేస్తున్నారని వెల్లడించారు. గజ్వేల్‌ లో కోటి రూపాయలతో షాదీఖానను ఏర్పాటు చేసుకున్నామని, షాదీఖానలో అదనంగా కిచెన్‌ షెడ్‌, కంపౌడ్‌ వాల్‌, భోజన శాల నిర్మాణాలు చేపట్టేందుకు మరో కోటి రూపాయల నిధులు పది రోజుల్లో మంజూరు చేస్తానని మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. 3 నెలల్లో పనులు పూర్తి చేసి విూకువినియోగంలోకి తెస్తామని మంత్రి చెప్పారు. పేద ముస్లింలకు భరోసా కల్పించిన ఘనత సిఎం కెసిఆర్‌దని అన్నారు.