పేపర్‌ లీకేజీకి కేసీఆర్‌దే బాధ్యత

2

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌

హైదరాబాద్‌,జులై 30(జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్‌ మెడికల్‌ పేపర్‌ లీకేజికి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే బాధ్యత అని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. దానికి బాధ్యులైన మంత్రులను బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌ను  కోరుతామన్నారు. ఈ ప్రభుత్వానికి పరిపాలించే సత్త లేక విద్యార్థులను ఇబ్బంది పెడుతోందని ఆయన మండిపడ్డారు. లీకేజికి బాధ్యులు ఎవరో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైస్‌ చాన్‌స్లర్ల నియామకాన్ని కూడా కోర్టు తప్పు పట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఇలావ్యవహరించడం దారుణమని, ప్రభుత్వం చేసేది మంచిదైతే ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్టు చేయిస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి వికృత చేష్టలు ఎక్కడా చూడలేదని ఉత్తమ్‌ మండిపడ్డారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుతో మంచి చేస్తుంటే ప్రజలను ఒప్పించాలి కానీ.. బలవంతంగా బెదిరించడం ఎందుకని ఆయన నిలదీశారు. సోమవారం తాము మల్లన్నసాగర్‌ ముంపు ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తామని చెప్పారు. అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్ను ఆయన నియోజకవర్గంలోకి వెళ్లనీయకపోవడం దారుణమని అన్నారు.