పేరాయి గూడెం పంచాయతీలో మంచినీటికి కటకట

– కాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన మహిళలు
– ట్రాఫిక్ అంతరాయం భారీగా నిలిచిన వాహనాలు
– ఇబ్బందులు పడ్డ వాహనదారులు
అశ్వరావుపేట ఆర్ సి, అక్టోబర్ 7 ( జనం సాక్షి) మండలంలోని పేరాయి గూడెం పంచాయతీలో ప్రజలకు మంచినీళ్లు అందక ఇబ్బందులు పడ్డారు. గత వారం రోజుల నుండి మంచినీళ్లు రావటం లేదని పాత పేరాయిగూడెంకు చెందిన మహిళలు కాళీ బిందెలతో రోడ్డు ఎక్కారు. కూలి పనులకు వెళ్లి ఇంటికొచ్చేసరికి మంచినీళ్లు రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని రాష్ట్రీయ రహదారిపై ఖాళీ బిందెలతో మహిళలు బయటాయించారు. మాకు అవసరమైన మంచినీళ్లు అందించాలని అధికారులను నిలదీశారు. గంటల తరబడి రాస్తారోకో చేయటంతో రహదారి వెంట భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు వాహనదారులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అశ్వరావుపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై బైఠాయించిన మహిళలకు సర్ది చెప్పడంతో అంతటితో గొడవ సర్దుమణిగింది. పంచాయతీ కార్యదర్శి పై మాకు మంచి నీళ్లు కావాలి ఎప్పుడు అందిస్తారని వాగ్వాదానికి దిగారు. దీంతో పంచాయతీ సెక్రటరీ స్పందించి నీళ్లు అందించడానికి సిబ్బంది లేక కొంత ఆలస్యం అయిందని త్వరలోనే మంచినీళ్లు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.