పేరిణి అభ్యసానికి గజ్జెధారణ

వరంగల్‌, అక్టోబర్‌ 26  : సుప్రసిద్ధ పేరిణి నృత్యకళను అభ్యసించే దాదాపు 60 మంది యువ కళాకారులకు శుక్రవారం ఉదయం గజ్జెధారణ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు విశ్వ విద్యాలయం రాణిరుద్రమాదేవి కళాపీఠం, నటరాజ రామకృష్ణ కళాజ్యోతి నృత్య అకాడమికి చెందిన పేరిణి రంజీత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో దాదాపు 60 మందికిపైగా బాలబాలికలు వివిధ కళారూపాయలయిన పేరిణి, ఆంధ్యనాట్యం, శాస్త్రీయ సంగీతంలో ప్రవేశాభ్యాసానికి గాను ఆటోనగర్‌ సమీపంలోని శృలగిరి శారద పీఠం ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. నృత్య గురువు పేరిణి రంజీత్‌కుమార్‌ పేరిణి, ఆంధ్ర నాట్యాన్ని అభ్యసించే విద్యార్థినీ, విద్యార్థులకు గజ్జెలను ధరింపచేసి ప్రాథమిక నృత్య అభినయాలను శారదమాత సమక్షంలో నెర్పించారు. శాస్త్రీయ సంగీతం విద్యార్థినీ విద్యార్థులకు సరస్వతీ స్తుతి ఆలపింపచేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పౌర సంబంధాల అధికారి వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మృదంగంపై ఏడిద భీమ శంకర్‌, కీబోర్డుపై రాయబారపు నాగరాజు, మోహసిన్‌పై బండి విజయ్‌, గాత్ర సహకారాన్ని రాయబారపు శ్రవణ్‌రాజు సహకారం అందించారు.