పేస్‌బుక్ అరెస్టుల కేసులో న్యాయమూర్తిపై బదిలీ, ఎస్పీ సస్పెన్షన్
ముంబయి, నవంబర్ 27(జనంసాక్షి) : బాల్ థాకరే మృతి అనంతరం ముంబయి బంద్‌పై సామాజిక మీడియా ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసిన ఇద్దరు యువతులు అరెస్టయిన ఘటనలో ముంబయి హైకోర్టు ఓ న్యాయమూర్తిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసిన యువతులను జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించిన న్యాయమూర్తి రామచంద్ర బగాడేను పల్గార్ నుంచి జలగావ్‌కు హైకోర్టు బదిలీ చేసింది. వారిపై పెట్టిన కేసులు కూడా సరియైనవి కావని, దీనిపై శాఖ సంబంధిత దర్యాప్తు అవసరమని కొంకన్ రేంజీ ఐజీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. శివసేన అధినేత థాకరే మృతి అనంతరం ముంబయిలో బంద్ పాటించడాన్ని ఇద్దరిలో ఓ యువతి ఫేస్‌బుక్‌లో వ్యతిరేకించగా ఆ పోస్టును ఇంకో యువతి లైక్ చేసింది. దీంతో గత సోమవారం ఇద్దరిని పోలీసులు 295(ఏ) సెక్షన్ కింద అరెస్టు చేశారు. అనంతరం వారు బెయిల్‌పై విడుదల అయ్యారు. ఇదే ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ మహారాష్ట్ర ప్రభుత్వం థానే రూరల్ ఎస్పీ రవీంద్ర సేవ్‌గార్‌కర్, మరో సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ పింగ్లేను సస్పెండ్ చేసినట్లు మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్ విలేకరులకు తెలిపారు.