పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

3

– తడిసి ముద్దవుతున్న ఆంధ్ర, తమిళనాడు

విజయవాడ/చెన్నై,నవంబర్‌16(జనంసాక్షి): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీట ముగిగాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా 16 జిల్లాల్లో అన్ని విద్యాలయాలకు తమిళనాడు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సహాయచర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించింది. వరుసగా రెండోసారి అల్పపీడన ప్రభావంతో తీవ్ర వర్షాలకు తమిళనాడు అతలాకుతలం అయ్యింది. అల్పపీడన ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో అదివారం అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తిరుపతి, తిరుమలలోనూ కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో కుండపోత వర్షాలతో తడిసి ముద్దయ్యింది. ఇక్కడ ఉన్న జలాశయాలు పూర్తిగా నిండుకుండగా మారాయి. దీంతో గేట్లను ఎత్తేసి నీటిని దుగువకు వదిలారు. తిరుమలలో ఆదివారం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో జలాశయాల్లో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. గోగర్భం జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. పాపవినాశనం నుంచి నీటిని విడుదల చేసేందుకు తితిదే సిబ్బంది చర్యలు చేపట్టారు. కుండపోత వర్షాల కారణంగా తిరుమల రెండో ఘాట్‌లో భాషికారి సన్నిధి వద్ద రౄదారి కుంగిపోయింది. అయితే వర్షం కారణంగా మరమ్మతు పనులకు అంతరాయం కలుగుతోంది. దీంతో లింక్‌ రోడ్డు ద్వారా వాహనాలను కొండపైకి పంపిస్తున్నారు.

శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నది ఉగ్రరూపం దాల్చింది. అరిణియార్‌, కృష్ణాపురం, బహుదా జలాశయాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జిల్లాలో మూడు చెరువులకు గండ్లు పడ్డాయి. కృష్ణాపురం జలాశయం పూర్తిగా నిండిపోవడంతో రెండు గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోనూ ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ తదితర ప్రాంతాల్లో వర్షం కుండపోతగా కురుస్తోంది. జిల్లాలోని కైవల్య, పంబలేరు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీరు పోటెత్తడంతో గూడూరు-విందూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

దీంతో జిల్లా అధికారులు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా వెంకటగిరిలో 24 సెంటీవిూటర్లు వర్షపాతం నమోదైంది. బాలాయపల్లిలో 14, డక్కిలిలో 10 సెంటీవిూటర్ల వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరు, ఉలవపాడు, ఒంగోలు మండలాల్లో వర్షం కురుస్తోంది. దీంతో అధికార యంత్రాంగంఅప్రమత్తం అయ్యింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అనంతపురం, కృష్ణా జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లో వరి కోతలకు సిద్ధమైన సమయంలో వర్షం కురుస్తుడటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇకపోతే నైరుతి బంగాళాఖాతంలో తీవ్రఅల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంకకు సవిూపంలో ఏర్పడిన ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు అధికారులు తెలిపారు. అది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని… రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నై నగర సవిూపంలో రైళ్ల పట్టాలపై వర్షపు నీరు చేరింది. దీంతో చెన్నై- విజయవాడ మార్గంలో ప్రయాణించే రైళ్లు రెండు గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. చెన్నై-గూడూరు మార్గంలో వెళ్లే రైళ్లను చెన్నై-రేణిగుంట వైపు మళ్లిస్తున్నారు. చెన్నై-విజయవాడ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. పినాకిని ఎక్స్‌ప్రెస్‌ గూడూరు వరకే రాకపోకలు సాగిస్తోంది. చెన్నై నుంచి తిరుపతి మార్గంలోనూ రైళ్లన్నీ రెండు గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి.