పోచంపల్లి చేనేతకు పెరుగుతన్న ఆదరణ
అద్భుతాలు సృష్టిస్తున్న కార్మికులు
భూదాన్‌పోచంపల్లి,మే21(జనం సాక్షి): ఒకప్పుడు సంప్రదాయ అద్దకంతో ప్రపంచ పోటీని ఎదుర్కోలేక పోయిన పోచంపల్లి చేనేత ఇప్పుడు ఇక్కత్‌గా ప్రసిద్ది చెందుతోంది. ఆధునిక డిజైన్లతో ఆకట్టుకుంటోంది. ఆన్ లైన్ మార్కెటింగ్‌తో దూసుకుని పోతోంది. ఇక్కత్ పేరుతో ప్రదర్శనలు ఇస్తోంది. ఇతర వ్యాపార సంస్థలతో లావాదేవీలు కుదుర్చుకుంటోంది. ప్రధానంగా విదేశాలకు ఎగుమతలపైనా దృష్టి పెట్టింది. దీంతో పోచంపల్లి చేనేత కార్మికులకు చేతినిండా పని దొరకడమే గాకుండా కడుపునిండా భోజనం చేయడంతో పాటు నాలుగు రాళ్లు వెనకేసుకునే స్థితి వచ్చింది. ఇదంతా మార్కెటింగ్ ప్రభావంతో మాత్రమే సాధ్యమయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లుగా వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. పోచంపల్లి చీరల్లో అనేక వినూత్న ప్రయోగాలు చేస్తూ మార్కెట్‌లో ప్రత్యేకతను తెచ్చిపెట్టారు. బెంగళూరు నుంచి తెప్పించిన స్వచ్ఛమైన పట్టు దారం.. సూరత్ నుంచి తెప్పించిన వెండి జరీతో చీరను నేసి ప్రత్యేకతను చాటారు. ఖరీదైన చీరను సాధారణ మహిళలు కొనుగోలు చేయలేరు. అంత ఖరీదైన చీరలను ప్రత్యేకంగా ప్రముఖులు మాత్రమే కొనుగోలు చేస్తారు. సెలబ్రిటీల డిజైనర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, పలు డిజైన్లు ఇచ్చి ఇలా నేసి ఇవ్వాలని ఆర్డర్ ఇస్తున్నారు. వారి కోసం ఆకర్షణీయమైన డిజైన్లతో చీరలను తయారు చేయిస్తున్నారు. పలువురు వ్యాపార వేత్తలకు ఖరీదైన చీరలను అందజేసి వారి మెప్పును పొందారు. ఇతర ప్రాంతాల్లో పేరుగాంచిన కంచి, ఉప్పాడ, జంథానీ, కోట డిజైన్లను, పోచంపల్లి ఇక్కత్ చీరల్లో మిళితం చేసి వినూత్న చీరలను సృష్టించడం ఇప్పడు పోచంపల్లి కళాకారులు అలవాటు చేసుకున్నారు.ఒకే చీరలో పోచంపల్లి ఇక్కత్, కంచి బార్డర్, కొంగు కోటా డిజైన్. ఇలా మూడు రకాల వైరైటీ డిజైన్లను రూపొందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఇలా పోచంపల్లి ఇక్కత్‌లోనే అనేక డిజైన్లు ను రూపొందిస్తున్నారు. 6 వేల నుంచి రూ.80 వేల విలువైన చీరెలను తయారు చేసే స్థాయికి ఇక్కడి కళాకారులు చేరుకున్నారు. దీంతో చీరలకు మంచి ఆదరణ లభిస్తుంది. విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా పోచంపల్లి నేతకు ప్రజాదరణ కల్పించేలా ప్రచారం చేస్తోంది.