పోడు భూముల సర్వే వెంటనే పూర్తి చేయాలి
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
యాదాద్రి భువనగిరి బ్యూరో, జనం సాక్షి .
పోడు భూముల సర్వే వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.శుక్రవారం నాడు మంత్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్ దివ్య, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు, జిల్లా అటవీ అధికారులతో పోడు భూముల సర్వే పనులను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోడు భూముల సర్వే వెంటనే పూర్తి చేయాలని, సర్వే సంబంధించి అవసరమైన చోట అదనంగా టీములు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సర్వే పూర్తయిన వెంటనే గ్రామ, డివిజన్ స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించి తీర్మానాలు పూర్తి చేయాలని తెలిపారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ఈనెల 20 లోగా పోడు భూముల సర్వే పూర్తి చేయాలని సూచించారు. పోడు భూముల దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. దరఖాస్తులు పెండింగ్ లేకుండా నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని, సబ్ డివిజన్, జిల్లా స్థాయి కమిటీలలో అప్రూవ్ చేసి ఆన్లైన్ పూర్తి చేయాలని తెలిపారు. సర్వే టీములకు అవసరమైన వసతులు సమకూర్చాలని, సర్వే పనులు వేగంగా నిర్వహించాలని తెలిపారు. అనంతరం వయోవృద్ధులు, తల్లిదండ్రుల లక్షల కోసం 2007 సంవత్సరంలో చేసిన చట్టం అమలును కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని, వారి హక్కులను రక్షించాలని, వారి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ఆర్డిఓ స్థాయిలో 60 రోజులలో, జిల్లా కలెక్టరు స్థాయిలో 30 రోజులలో పరిషరించాలని, వారి జీవనభృతికి, రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
హైదరాబాదు కలెక్టరేటు నుండి జిల్లా కలెక్టరు పమేలా సత్పతి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. జిల్లాలో పోడు భూముల సర్వేను వివరిస్తూ, చౌటుప్పల్, నారాయణపూర్, తుర్కపల్లి మండలాలకు సంబంధించి 10 గ్రామాలలో 2130 దరఖాస్తులకు గాను 187 దరఖాస్తులు పరిశీలించడం జరిగిందని, 6133 ఎకరాలకు గాను 132 ఎకరాలు సర్వే చేయడం జరిగిందని, 20 టీముల ద్వారా సర్వే నిర్వహించి గ్రామ, డివిజన్, జిల్లా స్థాయి కమిటీ తీర్మానాలతో ఈనెల 19 లోగా సర్వే పూర్తి చేస్తామని తెలిపారు.
జిల్లా కేంద్రం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు నారాయణరెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం ఉపేందర్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి పద్మజా రాణి, జిల్లా పంచాయితీ అధికారి సునంద, తదితరులు పాల్గొన్నారు.