పోలవరం నిర్వాసితులకు కాలనీలు
ఏలూరు,మే26(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్ని విధాలా అండగా ఉంటామని కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని, అందువల్ల నిర్వాసితులకు కూడా తగు న్యాయంచేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా వారి కోసం మూడు చోట్ల 17 కాలనీలను ఆధునిక వసతులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో 17 గ్రామాల్లో కొత్త లేఅవుట్లు ఏర్పాటుచేసి ఆధునిక సౌకర్యాలతో ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. 2,171 మంది నిర్వాసితులకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఆయా కాలనీల్లో రహదారులు, డ్రెయిన్లు, మంచినీటి ట్యాంకులు, దేవాలయాలు, చర్చిలు, పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, సామాజిక భవనాలు, ఆసుపత్రి భవనాలు, వ్యాపార సముదాయాలు, విద్యుత్తు సదుపాయం, డంపింగ్ యార్డులు ఏర్పాటుచేస్తామన్నారు. జీలుగుమిల్లి మండలంలో పది, బుట్టాయిగూడెం మండలంలో ఐదు, పోలవరం మండలంలో రెండు చొప్పున ఇళ్ల కాలనీలు నిర్మిస్తామని చెప్పారు.