పోలీసులే రాళ్లు విసిరితే?

కాశ్మీర్‌లో ఖాకీ మార్కు అకృత్యాలు
శ్రీనగర్‌, (జనంసాక్షి) :
శాంతిభద్రతలను రక్షించాల్సిన పోలీసులే వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే.. హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తున్న వారిపై గుండాల్లాగా దాడులకు తెగబడితే వారి చర్యను ఏమనుకోవాలి. నిత్యం ఆందోళనలు, సాయుధ బలగాల పహారాతో ఉద్రిక్తంగా ఉండే కళ్లోల కాశ్మీరంలో ఖాకీల అకృత్యానికి మచ్చు తునకలా నిలుస్తోంది ఈ చిత్రం. శ్రీనగర్‌లో శుక్రవారం ఆందోళనకారులు నిరసన తెలుపుతుంటే సాయుధ బలగాలు అడ్డుకున్నాయి. దీంతో కడుపుమండిన ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు. ఇంతలోనే పోలీసులు తామేమైనా తక్కువ తిన్నామా అంటూ వారిపై రాళ్ల వర్షం కురిపించారు. తమను గాయపరిస్తే ఎందుకు ఊరుకుంటామనే రీతిలో వారిని తరిమి తరిమి కొట్టారు. పోలీసుల దాడిలో పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. నిత్యం కాశ్మీర్‌లోయలో ఇలాంటి దారుణాలు సహజమే అయినా మానవ హక్కుల హననాన్ని ఏ ప్రజాస్వామిక వాది సమర్థించబోడు. సర్కారు ప్రోత్సాహంతో ప్రజలపై దాడులకు తెగబడడాన్ని పౌరసమాజం దృష్టికి తీసుకెళ్లాలి. ప్రకృతి తల్లి ఒడి ప్రశాంతతకు నిలయంగా మారేలా, పర్యాటక శోభను మళ్లీ సంతరించుకునేలా అక్కడి సర్కారే ప్రయత్నాలు ప్రారంభించాలి. కాశ్మీర్‌ సమస్యను రెండు దేశాల, ఆపై ప్రపంచ సమస్యగా మార్చిన వారు ఆత్మవిమర్శ చేసుకుంటే ప్రజలు ప్రశాంత జీవనం ప్రారంభించవచ్చు. అందుకు మొదట సర్కారే ప్రయత్నాలు ప్రారంభించాలని ప్రజాస్వామికవాదులు డిమాండ్‌ చేస్తున్నారు. కాశ్మీర్‌లో సైనిక బలగాల, పోలీసుల అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.