పోలీసుల అదుపులో 250 మంది బైక్ రేసర్లు

(హైదరాబాద్) :

నెక్లెస్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున బైక్ రేసింగ్‌లకు పాల్పడిన 250 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 250 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కావడంతో పోటాపోటీగా విపరీతమైన వేగంతో బైక్‌లు నడుపుతుండడంతో రామ్‌గోపాల్‌పేట, లేక్ పోలీసులు సంయుక్తంగా డ్రైవ్ నిర్వహించారు. సైఫాబాద్ ఏసీపీ సురేందర్, అడిషినల్ ఇన్‌స్పెక్టర్ జానయ్య, లేక్ ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి, 50 మంది సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి… నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్, లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ ఈ కార్యక్రమం జరిగింది. అదుపులో తీసుకున్న 250 మందిలో 100 మంది మైనర్లు ఉన్నారు. వీరికి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.