పోలీసు కొలువుల జాతర
– 9 వేల పోస్టుల భర్తీ
– మహిళలకు 33 శాతం రిజర్వేషన్
హైదరాబాద్ ,నవంబర్ 07 (జనంసాక్షి):
తెలంగాణలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వచ్చారు. ఆ మేరకు సదరు పోలీసు ఉద్యోగాల నియామక దస్త్రంపై సీఎం సంతకం కూడా చేశారు. ఒకేసారి 9 వేలకు పైగా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. సివిల్ విభాగంలో కచ్చితంగా 33 శాతం మహిళలు ఉండేలా చర్యలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అలాగే దేహ దారుఢ్య పరీక్షలు కూడా సరళతరం చేస్తూ సీఎం తన నిర్ణయాన్ని ప్రకటించారు. మొత్తం పోలీసు శాఖలో 8360, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 186, అగ్నిమాపక శాఖలో 510 పోస్టులు భర్తీ చేయనుంది సర్కార్. అలాగే 3200 మంది స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్, 107 మంది సివిల్ ఎస్‌ఐలు, 91 మంది ఆర్డ్మ్ ఎస్‌ఐలు, 288 మంది స్పెషల్ పోలీసు ఎస్‌ఐలు, 35 మంది కమ్యూనికేషన్ ఎస్‌ఐలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో 12 మంది ఎస్‌ఐలు, 174 మంది కానిస్టేబుల్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. పోలీసు శాఖలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించడం, .కానిస్టేబుళ్లకు ఐదు కిలోవిూటర్ల పరుగు పందెం పరీక్ష ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడం, .ఆర్మి తరహాలో రాత పరీక్షలు నిర్వహించాలని సూచించడంతో హర్షం వ్యక్తం అవుతుంది. కాగా తెలంగాణ చరిత్రకు సంబందించిన సిలబస్ తప్పనిసరి అని కేసిఆర్ స్పష్టం చేశారు. సీఎం ప్రకటించిన పోస్టులలో 3200 ప్రత్యేక పోలీసు పోస్టులు, 1800 సివిల్ కానిస్టేబుల్స్, ఎస్.ఐ.పోస్టులు 107, ఆర్‌ఎస్ ఐ పోస్టులు 97లు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.