పోలీస్‌స్టేషన్ సమీపంలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులో మహిళపై అత్యాచారం
పుణెలో సంచలనం
పుణె(జనంసాక్షి): ఆర్టీసీ బస్సులో ఓ మహిళపై అత్యాచారం జరగడం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. పుణెలోని ఓ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పార్కు చేసిన బస్సులో ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం. నిత్యం రద్దీగా ఉండే స్వర్‌గేట్ బస్టాండ్‌లో జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ మండిపడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సతారా జిల్లాలోని ఫల్తానాకు చెందిన ఓ మహిళ ఇళ్లలో పని చేస్తుంటుంది. మంగళవారం తెల్లవారుజామున ఆమె పోలీస్‌స్టేషన్‌కు 100 విూటర్ల దూరంలో ఉన్న బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి మాటలు కలిపాడు. ఆమె ఎక్కాల్సిన బస్సు ఇక్కడ లేదని ఓ పక్కన పార్క్ చేశారంటూ నమ్మబలికి తన వెంట తీసుకెళ్లాడు. అక్కడ చీకటిగా ఉండటంతో ఆమె వెనకడుగు వేసినా.. బస్సులో ప్రయాణికులు నిద్రపోతున్నారని, అందుకే లైట్లు ఆర్పేశారంటూ నమ్మించాడు. దీంతో ఆమె బస్సు ఎక్కగా.. వెంటనే లోపలికి వెళ్లి తలుపు వేసి.. అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఉదయం మరో బస్సు ఎక్కిన మహిళ.. తనకు జరిగిన ఈ దారుణం గురించి స్నేహితురాలికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సవిూపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితుడిని దత్తాత్రేయ రాందాస్(36)గా గుర్తించారు. అతడికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకొనేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. ‘‘మన ఆడబిడ్డకు ఇలా జరగడం దరదృష్టకరం. ఈ ఘటన బాధాకరం. నేరస్థుడికి ఉరి శిక్ష పడడమే సరైంది. ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించి దర్యాప్తు చేయాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పుణె పోలీస్ కమిషనర్‌ను స్వయంగా ఆదేశించాను. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే అతడిని పట్టుకుంటాం’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ అత్యాచార ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పుణెలో శాంతి భద్రతలు క్షీణించాయని.. నేరాలు పెరిగిపోయాయని మండిపడ్డాయి. ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపించాయి. శివసేన (యూబీటీ) నేతలు బస్టాప్ వద్ద నిరసనలు వ్యక్తం చేశారు. ‘‘పోలీసులు గస్తీ కాసే ప్రాంతంలోనే ఈ ఘటన జరిగింది. చట్టం పట్ల ఇలాంటి కొందరికి భయం లేకుండా పోయింది. మహిళకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదు. పుణెలో నేరాలను అరికట్టడంలో హోంశాఖ విఫలమైంది’’ అని ఎన్సీపీ (ఎస్పీ) ఆరోపించింది.