పోలీస్ శాఖలో ఉద్యోగాలకు సర్కారు గ్రీన్ సిగ్నల్
పోలీస్ శాఖ లో భారీగా ఉద్యోగాల భర్తీ
ఆమోదం తెలిపిన కెసిఆర్ సర్కార్
హైదరాబాద్,నవంబర్ 12 (జనంసాక్షి):
నిరుద్యోగులకు ఊరట కలిగించే మరో ఉద్యోగ ప్రకటనకు ప్రభుత్వం నిర్ణయించింది. పోలీస్ శాఖలో భారీగా ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తెలంగాణ పోలీస్ శాఖలో 2,904 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు అనుమతి ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసు ఉద్యోగాల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు అయ్యింది. ఒకేసారి 9,096 పోలీసు ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపడంతోపాటు భారీ సంస్కరణలకు ఆమోదముద్ర వేసింది. దీనిలో భాగంగా తొలిదశలో దాదాపు మూడు వేల పోస్టులకు ప్రభుత్వం భర్తీ చేయనుంది. మహిళలకు సివిల్ విభాగంలో 33 శాతం, ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అత్యంత కఠినంగా ఉన్న దేహదారుఢ్య పరీక్షలు సైతం ఇకపై సరళీకృతం కానున్నాయి. ఈ నూతన విధానాన్ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) ఆమోదించాల్సి ఉంది. పోలీసు శాఖలో 8,401 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులో 186, అగ్నిమాపక దళంలో 510 పోస్టులు ఖాళీగా ఉండగా, ఇవాళ 2,904 పోస్టులకు లైన్ క్లియర్ అయింది. పోలీసుశాఖలో 2,904 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ కూడా ఆమోదం తెలిపింది. నియామకానికి సంబంధించి ఈ మేరకు స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వివరాలిలా ఉన్నాయి. ఎస్‌ఐ సివిల్- 101, ఆర్‌ఎస్‌ఐ- 90, ఎస్‌ఐ సీపీఎల్- 02, ప్రత్యేక పోలీస్ కానిస్టేబుళ్లు- 2,379 ఉన్నాయి. కమ్యూనికేషన్ విభాగంలో పోలీస్ కానిస్టేబుళ్ల 332. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అతిత్వరలోనే వెలువడనుంది.