పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి.. శ్రద్ధాంజలి ఘటించిన – జిల్లా కలెక్టర్, ఎస్పీ
గద్వాల ప్రతినిధి అక్టోబర్ 21 (జనంసాక్షి):- విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు, సేవలు మరువలేనివని గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గద్వాల జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్ మైదానంలో అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జె. రంజాన్ రతన్ కుమార్ తోపాటు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గతేదాడి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 264 మంది అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. 1959 అక్టోబర్ 21న జరిగిన దురదృష్ట సంఘటనను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను స్మరణం చేసుకోవడం కోసం ప్రతి ఏటా ఈ రోజున పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. శాంతి భద్రతల కట్టడిలో పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో పోలీసులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తారన్నారు. సమాజం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని తెలిపారు.
జిల్లా ఎస్పీ జే.రంజాన్ రతన్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం ఎంతో మంది జవాన్లు తమ ప్రాణాలను అర్పించారన్నారు. ప్రజా రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నామన్నారు. విధి నిర్వహణలో భాగంగా గతేడాది 264 మంది వీరయోధులు మృతిచెందారన్నారు. లా అండ్ ఆర్డర్ నియంత్రణలో గతంలో గద్వాల జిల్లాలోనూ విధినిర్వహణలో పోలీసులు అనేకమంది వీర యోధులుగా మృతి చెందారన్నారు. సమాజం కోసం, భవిష్యత్తు తరాల కోసం, ప్రజా రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ప్రజాశ్రేయస్సు, శాంతి భద్రతలే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసులు తమ ప్రాణాలను ఒడ్డి విధులు నిర్వహిస్తున్నారని, పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరమని అన్నారు. జిల్లాలోని పోలీసులు అండగా ఉంటూ అనేక రకాలుగా వారిని ఆదుకుంటామన్నారు. పోలీసులు పడుతున్న కష్టాన్ని శ్రమను గుర్తిస్తే వారికి అదే సంతోషం ఇస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 264 మంది పోలీసుల పేర్లను అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ చదివి వినిపించారు. అందరికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరులైన పోలీసు కుటుంబ సభ్యులకు శాలువాతో సత్కరించి, వారి సమస్యలను విన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో డిఎస్పీ రంగస్వామి,పలువురు సిఐలు చంద్రశేఖర్, శివ శంకర్ గౌడ్, రాములు నాయక్,ఆర్‌ఐలు, పోలీసు అధికారుల సంఘం నాయకులు పోలీసు కుటుం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area