పోలీస్ స్టేషన్ లో నిందితుడి ఆత్మహత్య
మెదక్ : మెదక్ జిల్లా జోగిపేట పోలీసు సర్కిల్ పరిథిలోని పుల్కల్ పోలీసు స్టేషన్‌లో రిమాండ్‌లో ఉన్న నిందితుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. వివరాలు.. మెదక్ జిల్లా సదాశివపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన మంజుల(30) అనే మహిళ రెండు నెలల కిందట అతి కిరాతకంగా హత్యకు గురైంది. తీవ్రంగా కొట్టి పెద్దారెడ్డిపేట శివారులో కాల్చి బూడిద చేశారు. ఈ కేసులో జనవరి 13న స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అదే గ్రామానికి చెందిన లక్ష్మయ్యను నిందితుడిగా గుర్తించారు.
ఈ విషయం తెలిసిన లక్ష్మయ్య ఎలాగైనా కేసు నుంచి బయటపడాలని ముంబైకి వెళ్లిపోయాడు. పోలీసులు అప్పటి నుంచి అతని కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం గ్రామానికి తిరిగొచ్చిన లక్ష్మయ్య ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరిలించారు. అయితే బుధవారం రాత్రి స్టేషన్‌లో తన చొక్కాతో ఉరివేసుకున్నాడు. అతన్ని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్థారించారు. కానీ పోలీసులే లక్ష్మణ్ ను తీవ్రంగా కొట్టడంతో మృతిచెందాడని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.