పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగుల తిప్పలు.. అసంపూర్తి సమాచారంతో అధికారులు
వేములవాడ గ్రామీణం, నవంబర్ 28 (జనంసాక్షి): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైంది అంటూ అటు అధికారులు, ఉద్యోగులు ప్రచారం చేస్తున్నప్పటికీ, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో ఇబ్బందులు తప్పడం లేదు. నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పేసిలిటేషన్ కేంద్రాలలో సంబంధిత అధికారుల వద్ద పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన సమాచారం పూర్తిస్థాయిలో లేకపోవడం ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి నెలకొంది. వేములవాడ తహాసిల్దార్ కేంద్రం వద్ద మంగళవారం మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కోక తప్పడం లేదు. ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి స్వంత నియోజకవర్గం, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే, ఎన్నికల విధులు నిర్వహించబోయే ఏ నియోజకవర్గాలలో ఓటు వినియోగించుకోవాలో తెలిపే పరిస్థితిలో అధికారులు లేకపోవడంతో ఉద్యోగులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రేపు ఎన్నికల విధులలో పాల్గొనవలసి ఉన్నందున వెంటనే అధికారులు విధులలో పాల్గొనే ఉద్యోగుల ఓటును సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.