ప్రకటనొచ్చేవరకు దీక్ష విరమించం
– స్పష్టం చేసిన సీఎం రమేష్, బీటెక్ రవి
– ఏడవ రోజుకు చేరిన ఆమరణ నిరాహార దీక్ష
– బీటెక్ రవికి తక్షణ వైద్యం అవసరం
– సూచించిన వైద్యులు
– దీక్షా స్థలిని సందర్శించి సంఘీభావం తెలిపిన పలువురు నేతలు
కడప, జూన్27(జనం సాక్షి) : ఉక్కు పరిశ్రమపై ప్రకటన వచ్చే వరకు తాము చేపట్టిన నిరాహార దీక్షను విరమించేది లేదని తెదేపా నేతలు సీఎం రమేష్, బీటెక్ రవిలు స్పష్టం చేశారు. కాగా వీరు చేపట్టి నిరవదిక నిరాహార దీక్ష బుధవారం ఏడవ రోజుకు చేరింది. కాగా వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు సీఎం రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవిల ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని తెలిపారు. బీటెక్ రవికి తక్షణ వైద్యం అందకపోతే ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. మరోవైపు ఉక్కు పరిశ్రమపై కేంద్రం ప్రకటన చేసేవరకు ఆందోళన విరమించేది లేదని సీఎం రమేశ్, బీటెక్ రవి పునరుద్ఘాటించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు రమేశ్, రవిలను పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్ మాట్లాడుతూ.. తాము చేపట్టిన దీక్షపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ నేతలంతా తమకు ఫోన్ చేసి మద్దతు ప్రకటించినట్లు చెప్పారు. దీక్ష విరమించి పార్లమెంటులో పోరాడదామని విజ్ఞప్తి చేశారని..
అయితే ఉక్కు పరిశ్రమ సాధించేంతవరకు దీక్ష విరమించేది లేదని వారికి చెప్పినట్లు వెల్లడించారు. ఉక్కు పరిశ్రమ కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి రావాలని సీఎం రమేశ్ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ ఇవ్వడం మంత్రి బీరేంద్రసింగ్ చేతిలో లేదని.. అంతా మోదీ చేతిలోనే ఉందన్నారు.