ప్రగతినివేదన సభకు అంతా తరలి రావాలి

మెదక్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): టిఆర్‌ఎస్‌ తలపెట్టిన ప్రగతి నివేదన సభకు జిల్లా నుంచి గొల్ల, కురుమలు దండులా కదిలిరావాలని రాష్ట్ర పెంపకందారుల ఫెడరేషన్‌ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌ పిలుపునిచ్చారు. గొర్రెల కాపర్లకు అండగా నిలిచిన కెసిఆర్‌కు అండగా నిలిచేలా తమ సత్తాచాటాలని అన్నారు. సంక్షేమ పథకాలతో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలంగాణ రాష్ట్రం నేడు యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ పరిస్థితులలో సీఎం కేసీఆర్‌ తలపెట్టిన ప్రగతి నివేదన సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. యాదవ సోదరులను ఆర్థికంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో మొదటి విడతగా సుమారు రూ.5వేల కోట్లతో 3.50లక్షల మందికి 75శాతం రాయితీపై గొర్రెలను అందించామన్నారు. మలి విడతలో మరో రూ.5వేల కోట్లతో 4లక్షల మందికి అందించబోతున్నామన్నారు. అన్ని రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధిని ప్రశంసిస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. నిరంతర శ్రామికులు కేటీఆర్‌, హరీష్‌రావు, ఎంపీ కవితలను విమర్శించడం వారి చేతగానితనం అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అన్ని రాష్ట్రాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలో కొచ్చిన నాలుగున్నర ఏళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కాని సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలయ్యాయన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలనే సంకల్పంతో పలు పథకాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును రాష్ట్ర ప్రజలకు తెలియచేసేందుకే సీఎం కేసీఆర్‌ ప్రగతి నివేదిక సభను నిర్వహిస్తున్నట్లు రాజయ్య తెలిపారు. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ కోసం రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌, రైతు బీమా, రైతుబందు, పట్టాదార్‌ పాసు పుస్తకాల అమలు తదితర పథకాలను అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలను అమలు చేసి దేశంలోనే నెంబర్‌ వన్‌ సీఎంగా నిలిచారని రాజయ్య అన్నారు.ప్రగతి నివేదన సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

———