ప్రగతి నిరోధకులే అడ్డుకుంటున్నారు

3

– ప్రధాని నరంద్ర మోదీ

కొచి,డిసెంబర్‌15(జనంసాక్షి): ప్రధాన నరేంద్ర మోదీ మరోసారి పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీతో  పాటు ఇతర ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని కొల్లాం సభలో మాట్లాడారు.  దేశ సంక్షేమాన్ని పట్టించుకోకుండా అనవసరంగా పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయాం కనుక పార్లమెంట్‌ను సాగనీయం అనే ధోరణిలో కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ పరోక్షంగా కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత శీతాకాల సమావేశాలు ఈ నెల 23తో ముగియనున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని  భావిస్తోంది. అయితే నేషనల్‌ హెరాల్డ్‌ కేసుపై కాంగ్రెస్‌ పార్టీ ఉభయ సభలను వరుసగా అడ్డుకుంటోంది. దీంతో జీఎస్టీ బిల్లుకు ఈ సారి కూడా మోక్షం కలిగేలా లేదు. ఈ నేపథ్యంలో దేశ అభివృద్దికి అవరోధంగా మారిదంటూ కొల్లాం సభలో మోదీ విరుచుకుపడ్డారు. ఇదిలా వుండగా కేరళ రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను సందర్శించారు. అరేబియా సముద్రంలో 40 నాటికల్‌ మైళ్లదూరంలో ఉన్న ఈ నౌక దగ్గరికి ప్రధాని హెలికాప్టర్‌లో చేరుకున్నారు. ప్రధానికి నౌకాదళ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన త్రిదళాధిపతులు, డిఫెన్స్‌ ఉన్నతాధికారులతో మోదీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ కూడా ఇందులో పాల్గొన్నారు. 2013లో జాతికి అంకితం చేసిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను ప్రధాని మోదీ సందర్శించడం ఇది రెండో సారి.