ప్రచారంలో జోరు పెంచిన టిఆర్‌ఎస్
గ్రామాల్లో నేతల విస్తృత పర్యటనలు
పలకరింపులతో ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు
హైదరాబాద్,అక్టోబర్13(జనంసాక్షి): టిఆర్‌ఎస్ అబ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. ఎక్కడిక్కడ నిరంతరాయంగా ప్రచారంలో దూసుకుని పోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలను నేరుగా కలుస్తూ ఓట్లను అర్థిస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశాలు, గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తున్నారు. కులసంఘాల ఆశీర్వాద సభలు, డివిజన్లలో పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు. అలాగే పార్టీలోకి వెల్లువలా చేరికల జోష్‌ను పెంచుతున్నారు. గ్రామగ్రామానా ఎక్కడ చూసినా టీఆర్‌ఎస్ శ్రేణుల సందడే కనిపిస్తున్నది. గులాబీ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 29లో గల రిక్షాకాలనీలో బండ్ల శ్రీనివాస్, దేవిదాస్ నేతృత్వంలో కాలనీకి చెందిన సుమారు రెండు వందల మంది యువకులు పెద్ద ఎత్తున మంత్రి జోగురామన్న సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. యువకులకు మంత్రి రామన్న గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థి జలగం వెంకట్రావ్ శనివారం ఉదయం 7గంటల నుంచే జిల్లా కేంద్రం సవిూపంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. తిమ్మాపూర్ మండలం నేదునూర్, మక్తపల్లి గ్రామాల్లో మానకొండూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య మాడ్గులపల్లి మండలం గ్యారకుంట పాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించి పార్టీ జెండా ఆవిష్కరించారు. మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రి పాలెంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పల్లెల్లో ప్రతివీధిలో రోడ్డు షో నిర్వహిస్తూ ఓటర్లకు అభివాదం చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. జనగామ పట్టణంలో ఒకటో వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా ¬టల్ దగ్గర ఛాయ్ చేస్తూ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఓటు అభ్యర్థించారు. బొప్పారంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశం ఎన్నికల ప్రచారం చేపట్టారు.సంగారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొండాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో అభ్యర్థి ప్రభాకర్ ఇంటింటి ప్రచారం నిర్వస్తున్నారు. ప్రచారం సందర్భంగా గ్రామానికి వచ్చిన టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతాప్రభాకర్ కు ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ.. ఎమ్మెల్యేగా తమ ప్రాంతంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన చింతా ప్రభాకర్ కే ఓటేసి గెలిపిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు.ప్రజల నుండి మంచి స్పందన ఉందని.. నాలుగేండ్లలో సంగారెడ్డి నియోజకవర్గంను 2 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని.. మరోసారి ప్రజలు తనను గెలిపిస్తే.. మరింతగా సంగారెడ్డి ప్రజలుకు సేవ చేస్తానని చింతా ప్రభాకర్ అన్నారు.