ప్రచారంలో టిఆర్‌ఎస్‌ ముందున్నది

మళ్లీ గెలుపు ద్వారా టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తోంది: ఆరూరి రమేశ్‌
వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో ప్రచారం బాగుందని, టిఆర్‌ఎస మళ్లీ గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. కెసిఆర్‌ చేస్తున్న అభివృద్ది పనులే గెలుపునకు బాటలు వేయనున్నాయని అన్నారు. విపక్షాల అభ్యర్థులు ఎవరో తెలియక ప్రజలు తికమకలో ఉండగా, టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుని పోతున్నారని అన్నారు. అందుకే వివిధ పార్టీల నుంచి అనేకులు టిఆర్‌ఎస్‌లో చేరి కెసిఆర్‌ వెంట నడుస్తామని చెబుతున్నారని శుక్రవారం నాడిక్కడ అన్నారు.
గోదావరి జలాలను జిల్లాకు తరలించిన ఘటన కెసిఆర్‌దన్నారు. రైతు బీమా, రైతు బంధు, సకాలంలో ఎరువులు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, పింఛన్లు ఇవి చాలవా ప్రజలు తిరిగి మాకు పట్టం కట్టడానికి అన్నారు.  60 ఏళ్లలో కాంగ్రెస్‌ పార్టీ ఈ ప్రాంతానికి ఒరగబెట్టిందేవిూ లేదన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం లో దేవాదుల, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సుమారు 11 వేల ఎకరాలకు సాగు నీరందుతోంది. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు కాల్వల కింద 38 చెరువులు నింపుతున్నట్లు వెల్లడించారు. వీటి ద్వారా సుమారు 5వేల ఎకరాలకు నీరు అందుతుంది. ఇక ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సుమారు 6వేల సాగు నీరు అందుతుంది. నియోజకవర్గంలో 32 చెరువులు నింపుతున్నారు. హసన్‌పర్తి, హన్మకొండ, వరంగల్‌, ఐనవోలు, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లోని చెరువుల్లో ఎస్సారెస్పీ నీటిని మళ్లిస్తున్నారు. గతంలో వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు ఎస్సారెస్పీ జలాలు అందలేదు. ఇప్పుడిప్పుడే డబుల్‌ బెడ్‌రూం పథకం పనుల
వేగం అందుకుంటోంది. వరంగల్‌ రెవెన్యూ మండలం ఎస్సార్‌నగర్‌లో సుమారు 800 ఇళ్లు. హసన్ద్‌పర్తి మండలం సిద్ధాపురం, అర్వపల్లిల్లో 40 డబుల్‌బెడ్‌ రూం పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. కాట్యాల్రపల్లి 28 డబుల్‌ బెడ్‌రూంల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. చింత నెక్కొండ 60డబుల్‌ బెడ్‌రూంలు, తుర్కల సోమారంలో 30 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రెండు గదుల ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన వందల కొద్ది సంక్షేమ పథకాలు ఇవాల ప్రజలకు లబ్ధి చేకూర్చుతున్నాయన్నారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్‌కు నిధులు, బీసీ కార్పొరేషన్‌ మైనారిటీ కార్పొరేషన్‌కు నిధులు, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కరెంటు చార్జీలు పెంచకుండా చేయడం వంటి సంక్షేమ పథకాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, 24 గంటల కరెంటు, రూ.లక్ష రుణమాఫి, రూ.వెయ్యి పింఛన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని అన్నారు.