ప్రచారంలో దూసుకుని పోతున్న టిఆర్‌ఎస్‌ నేతలు

ఊరూరా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిస్తున్న గులాబీ నేతలు

ఖరారు కాని కాంగ్రెస్‌ అభ్యర్థులు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలకు సైరన్‌ మోగించిన టిఆర్‌ఎస్‌ ప్రచారంలోనూ దూసుకుని పోతోంది. ఇతర పార్టీలకు అందనంత దూరంగా ప్రచారంలో నేతలు దూసుకుని పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో ముందున్నారు. కాంగ్రెస్‌ మహాకూటమి అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అలాగే బిజెపి అభ్యర్థులెవరో తెలియదు. ఇదే అదనుగా టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారం ఉధృతం చేశారు. అభ్యర్థులను ప్రకటించిన నాటినుంచి జిల్లా వ్యాప్తంగాటీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గులాబీ పార్టీ నేతలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా.. ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. కుల సంఘాలు, రైతులు, వ్యాపారులు, మహిళలు, చేతివృత్తుల వారితో విూటింగ్‌లు పెట్టి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అండగా నిలిచేలా తీర్మానాఉల చేయిస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మోటార్‌ సైకిళ్లు, ట్రాక్టర్ల ర్యాలీలు, డప్పు చప్పుళ్లు, మంగళహారతులు, నృత్యాలతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు స్థానికులు ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు భారీ సంఖ్యలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న సభలకు స్థానికులు పెద్దసంఖ్యలో హాజరై తాము టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటామని తీర్మానం చేయిస్తున్నారు. మొత్తంగా కొత్త తరహాలో గులాబీ నేతలు ప్రచారంలో ఉన్నారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న మంత్రి జోగు రామన్న జిల్లా కేంద్రంతోపాటు పాటు జైనథ్‌, బేల, మావల, ఆదిలాబాద్‌ రూరల్‌ మండలాల్లో ఓ విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. బోథ్‌ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు సైతం బోథ్‌, ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్‌, సిరికొండ, భీంపూర్‌, తాంసి, తలమడుగు మండలాల్లో ప్రచారాన్ని చేపట్టారు. ఇకపోతే కాంగ్రెస్‌లో టిక్కెట్లు ఖరారు కాకున్నా పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో నలుగురు అభ్యర్థులు హస్తం పార్టీ టికెట్‌ ఆశిస్తుండగా.. బోథ్‌లో మూడు గ్రూపుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టికెట్‌ ఆశిస్తున్న నేతలు అధిష్టానం వద్ద జోరుగా పైరవీలు చేసుకుంటున్నారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలో వర్గపోరు అధికంగా ఉంది. ఆరుగురు అభ్యర్థులు పార్టీ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రాథోడ్‌ రమేశ్‌ తనకే టిక్కెట్‌ అంటూ ప్రచరం చేపట్టారు. ఉట్నూర్‌, ఇంద్రవెల్లి మండలాల్లో ఓటర్లను కలుస్తున్నాడు.

జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు అసమ్మతి బెడద అధికంగా ఉంది. టికెట్‌ కోసం చివరి దాగా ప్రయత్నించి దక్కని వారు ఇండిపెండెంట్‌గా పోటీలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా పార్టీల్లోనూ పోటీ చేసే అభ్య ర్థులు కొలిక్కి రాలేదు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైనదని, విమర్శకులకు తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర మంత్రి జోగు రామన్న అన్నారు. యువకులు, కాలనీవాసులు, మహిళలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జోగు రామన్న పేదల గురించి గత ప్రభుత్వాలు ఏనాడూ ఆలోచించలేదన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల పక్షపాతిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. రాబోయే కాలంలో విపక్షాల విమర్శలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు.