ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి నేతలు
ప్రజా కూటమితోనే తెలంగాణకు విముక్తి
కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటూ పిలుపు
వరంగల్,డిసెబర్1(జనంసాక్షి): తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ప్రజాకూటమి అభ్యర్థులు పిలుపునిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్తులు ఉమ్మడి జిల్లాలో ప్రచార జోరు పెంచారు. జనగామలో పొన్నాల లక్ష్మయ్య, పాలకుర్తిలో జంగారాఘవరెడ్డి, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి, పరకలలో కొండా సురేఖ తదితరులు ప్రచార¬రు పెంచారు. టిడిపి నేత రేవూరు ప్రకాశ్ రెడ్డి, ములులగులో సీతక్క కూడ ఆప్రచారంలో దూసుకుని పోతున్నారు. వీరంతా ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని జనగామ ప్రచారంలో పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం, అర్హులైన పేదలందరికీ రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి ఇస్తానని మోసగించారని విమర్శించారు. చేయి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బంగారు తెలంగాణ వస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశ మిగిలిందన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రూ.2లక్షల వరకు పంట రుణాలను రైతులెవరూ చెల్లించొద్దని, ప్రజాకూటమి అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని సీతక్క అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన తెరాస.. వాగ్దానాలను విస్మరించిందని ఆరోపించారు. తెరాస పాలనలో పొదుపు సంఘాల మహిళల బతుకులు రద్దు చేసిన రూ.వెయ్యి నోటులా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాకూటమి అధికారంలోకి రాగానే మహిళా సంఘాలకు రూ.10 లక్షల దాకా వడ్డీ లేని రుణాలందించి ఆడబిడ్డలను లక్షాధికారులను చేస్తామని చేప్పారు. ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సంక్షేమ పథకాలు రెట్టింపు చేస్తామని గండ్ర తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పింఛన్లు, కల్యాణలక్ష్మి ఆగిపోతాయని కేసీఆర్, కూసుకుంట్ల చెప్పే మోసపు మాటలు నమ్మవద్దన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రజలంతా సంతోషంగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరారు. గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఎన్నికల్లో తెరాసకు గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు.