ప్రజలకు అందుబాటులో గ్రామాలను అభివృద్ది చేయాలి

కొత్త సర్పంచ్‌లకు కడియం హితవు

వరంగల్‌,జనవరి23(జ‌నంసాక్షి): నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకులుగా పని చేయాలని మాజీ డిప్యూటి సిఎం,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం అర్హులకు అందేలా చూడాలని, అప్పుడే సీఎం కేసీఆర్‌ కలలు నెరవేర్చిన వారమవుతామన్నారు. జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో టీఆర్‌ పార్టీ క్లీన్‌ చేసిందని చెప్పారు. పార్టీని ఆదరించి ఓట్లు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే రెండువిడతలతో పాటు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా గులాబీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడు జరగని అభివృద్ధి ఈ ఐదేండ్లలో చేసి చూపించిన ఘనత సిఎం కెసిఆర్‌దని అన్నారు. మరో 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో సీఎంగా కేసీఆరే కొనసాగుతారని తెలిపారు. గ్రావిూణ ప్రాంతాల్లో కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని కొనియాడారు. అభివృద్ది చేసుకోవడం ద్వారా సీఎం కేసీఆర్‌ కన్న కలలను సాకారం చేద్దామని అన్నారు. నూతనంగా ఎన్నికైన ఆయా మండలాల్లోని గ్రామాల సర్పంచులను ఆయన అభినందించారు. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో గ్రామాలు ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధంగా ఉండేవన్నారు. మెజార్టీ ఉన్న గ్రామాలే అభివృద్ధి చేసుకొనే వారని, మిగతా చిన్న గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. చిన్న గ్రామ పంచాయతీలతోనే అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ కొత్తగా పంచాయతీలను ఏర్పాటు చేశారన్నారు. దీంతో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వారి కల నెరవేరిందన్నారు. తండాలను పంచాయితీలుగా చేయడంతో స్వయం పాలన మొదలయ్యిందన్నారు.