ప్రజలను ఎంతోకాలం మభ్యపెట్టలేరు: బిజెపి

మెదక్‌,మే31(జ‌నం సాక్షి): ప్రజలకు ఇచ్చిన ఆకాంక్షలను అమలు చేయకపోగా తామేదో చేశామని చెప్పుకోవడం ద్వారా ప్రజలను ఎంతోకాలం వంచించలేమని గుర్తుంచుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పామో అది చేస్తున్నామా లేదా అన్నది ఆలోచన చేయాలన్నారు. నాలుగేళ్లో ప్రజల ఆకాంక్షలకు అనగుణంగా పాలన సాగించామా లేదా అన్నది ప్రజల్లోకి వెళితే తెలుస్తుందని అన్నారు. అయితే టీఆర్‌ఎస్‌ ఎన్నడూ లేనంతగా బలహీనపడిందని, అందుకే సర్వేల రూపంలో సీఎం కేసీఆర్‌ బలంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఉద్యమ నేతకు ఇలాంటి సర్వేలు ఎందుకన్నారు. ప్రజలు తన వెంటే ఉంటే ఇవన్నీ ఎందుకని అన్నారు.  రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పదన్నారు. ప్రజలు ఇప్పుడు కెసిఆర్‌ గురించి ఆలోచిస్తున్నారని,  బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్యానించారు. విపక్షాలు బోగస్‌ అంటూ సీఎం మాట్లాడుతున్నారని, కాని కేసీఆరే అసలు బోగస్‌ అన్నారు. కేసీఆర్‌ అసమర్థ పాలన వల్ల అన్ని వ్యవస్థలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయని, మిగులు బడ్జెట్‌ కాస్త లోటు బడ్జెట్‌గా మారిందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులు దారిమళ్లకుండా ప్రశ్నించే హక్కు ఉందన్నారు.
—————————