ప్రజలపై కరువు ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, ఆగస్టు 9 (జనంసాక్షి) : కరువు ప్రభావం ప్రజల మీద పడకుండా అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రెవెన్యూ, నిపత్తుల శాఖామాత్యులు ఎన్. రాఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ, కరువు పరిస్థితులపై తీసుకోవలసిన చర్యల గురించి వ్యవసాయ, పురపాలక శాఖామాత్యులు కన్నా లక్ష్మినారాయణ, మహిధర్ రెడ్డిలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు, కరువు వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్లు స్థానిక అవసరాల దృష్ట్యా ప్రజ లకు సౌకర్యాలు కల్పించడానికి, కరువును ఎదుర్కొవడానికి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని, ప్రతిపాదనలు పంపించాలని తెలిపారు. 80లక్షల హెక్టార్లలో సాధారణ సాగు లక్ష్యంకాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 56 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారన్నారు. కృష్ణ, తుంగభద్ర, పెన్నా జలాశయాల్లో చాలా తక్కువగా నీటి నిలువలున్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా తాగునీటి సమస్య ఉందని, ఇందుకై 45.20 కోట్ల రూపాయలు విడుదల చేశామని, నిధుల కొరత లేదని తెలిపారు. తాగునీటికై మరో 20 కోట్ల రూపాయలను వారం రోజుల్లో మంజూరు చేయనున్నామని, 3లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం కొరత ఉన్నందున పశుగ్రాసం సాగు చేయడానికి సబ్సిడి ద్వారా విత్తనాలు అందించనున్నామన్నారు. ఉపాధిహామీ పథకంద్వారా వంద రోజులు పూర్తయిన వారికి 150 రోజులకు పెంచడానికి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నామన్నారు. మున్సిపల్ శాఖామాత్యులు మహిధర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణాల్లో తాగునీటి సమస్యలు అధిగమించడాననికి 23 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, మరో 55 కోట్ల రూపాయలు అడిగామని, ఇందులో 20కోట్ల రూపాయలు తొలి విడతగా విడుదల చేయడానికి అంగీకరించామన్నారు. బిల్లులు పెండింగ్‌లో లేవని,అయితే యుసిలు వెంటనే సమర్పిస్తే మిగతా నిధులు విడుదల చేస్తామన్నారు. తాగునీరు విడుదల చేసే సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయాలేని, తద్వారా అనధికారికంగా మోటార్ల ద్వారా నీరు తోడుకోవడాన్ని నిరోధిం చవచ్చున్నారు. తాగునీటికై జూన్ 2013 వరకు అవసరాలు తీర్చడానికి ప్రతిపాదనలు, ప్రణాళికలు పంపించాలని కలెక్టర్లకు సూచించారు. వ్యవ సాయ శాఖామాత్యులు కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ కెనాల్ ఏరియా పరిస్థితి బాగా లేదని, అయితే ఆగస్టు 15 వరకు సమయం ఉన్నందున శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులోనికి నీరు వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. అవసరమైన విత్నఆలు, ఎరువులు సిద్దంగా ఉంచామని, 15లక్షల హెక్టార్లలో పంటలసాగు ఇబ్బందికరంగా ఉన్నందున ఎల్‌ఐసి రైతులకు కనీసం కొత్తగా 10లక్షల మందికిరుణాలు ఇప్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకై 2వేల కోట్ల రూపాయలు రుణాలు ఇస్తామని బ్యాంకర్లు ఎస్‌ఎల్‌బిసి ద్వారా ఇప్పటికే అంగీకరించారన్నారు.
15 వేల టన్నుల యూరియా కావాలి – కలెక్టర్
జిల్లాలో కలెక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ మాట్లాడుతూ జిల్లాలో 24.30 శాతం వర్షపాతం తక్కువగా ఉందని, కొంతమేర పంటలు సాగు చేస్తున్నారని, జిల్లాలో 87.938 హెక్టార్లలో వరిపంట సాగు చేశారని, మరో 16వేల హెక్టార్లలో సాగుచేయనున్నారని తెలిపారు. జిల్లాకు మరో 15వేల మెట్రిక్ టన్నుల యూరియా రావలసి ఉందని కోరగా త్వరలోనే విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి నాగిరెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఎరువులు మహారాష్ట్రకు అక్రమ రవాణా జరగకుండా, అక్రమంగా నిల్వలు చేయకుండా వ్యవసాయ సంయుక్త సంచాలకులు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈవీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఓ జగదీశ్వరాచారి, సిపిఓ నబీ, జెడిఎ ధర్మానాయక్, ఎల్‌డిఎం మూర్తి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ఇంద్రసేన్, పశు సంవర్థక శాఖ జెడి శంకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు రామకృష్ణరావు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.