ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
మార్పు కోసం బిజెపిని గెలిపించాలి: రఘునందన్
సిద్దిపేట,అక్టోబర్9(జనంసాక్షి): ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే బిజెపి కూడా మార్పు కోసం బిజెపి అంటూ ప్రచారం చేయబోతున్నదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు అన్నారు. అధికార టిఆర్‌ఎస్ ఇచ్చిన హావిూలు నిలుపుకోలేదని, తెలంగాణ ఆకాంవక్షలను తుంగలో తొక్కిందని అన్నారు. అందుకే అమిత్‌షా సభకోసం భారీగా జనం రానున్నారని మంగళవారం నాడిక్కడ తెలిపారు. బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆంధ్రపాలకులు, నేడు తెలంగాణ వచ్చిన విూ పాలనలో ఏమి మార్పు వచ్చిందని ప్రశ్నించారు. దేశప్రజల ఆశీర్వాదంతో నరేంద్రమోదీని ప్రధాన మంత్రిని చేస్తే అన్ని గ్రామాలకు సమానంగా నిధులు విడుదల చేశారన్నారు. కిలో బియ్యం మొదలు కొని, గ్యాస్, ఉపాధిహామి పథకం, హరితహారం, కేసీఆర్ కిట్ వరకు కేంద్రం నుంచే డబ్బులు వస్తున్నాయని చెప్పారు. మార్పు కోసం బరిలో ఉన్న బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. దుబ్బాక నియోజకవర్గం అభ్యర్థిగా తాను బరిలో ఉండనున్నట్లు తెలిపారు. పార్టీ ఆదేశిస్తే పోటే చేస్తానని అన్నారు. ఇదిలావుంటే రైతుబంధు చెక్కులు నేరుగా ఖాతాల్లో వేసినట్లుగానే చీరెలు మహిళలకు అందేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని ఎందుకు అభ్యర్థించలేదో టిఆర్‌ఎస్ నేతలు చెప్పాలన్నారు. ఎన్నికల సంఘం వద్దన్నందున ఈ ఏడాది తాము బతుకమ్మ పండగ జరుపుకోమని… చీరెలు పంచమని చెప్పడాన్ని తప్పు పట్టారు. నెల క్రితమే చీరెలు సిద్ధంగా ఉన్నాయని ఆ శాఖ అధికారులు ప్రకటించారని.. ఎందుకు ఆలస్యం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళి పేరుతో ప్రతిపక్షాలపై ఏడ్చే విధానం నమ్మశక్యంగా లేదన్నారు. ముందుగా చీరెలు పంచితే గతేడాదిలా ఏ కుంభకోణం బయటకు వస్తుందో అని భయపడ్డారని.. ఏం గొడవలు వస్తాయో అని పంచలేదని ఆయన విమర్శించారు. స్వామి పరిపూర్ణానంద బిజెపిలో చేరితే స్వాగతిస్తామని అన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమేనని ప్రకటించారు.