ప్రజల ఆశలు వమ్ము

ఫలితాల నుంచి పాఠాలు నేర్వని బిజెపి

ఓ వర్గం నేతల్లో అధినాయకత్వం తీరుపై ఆందోళన

న్యూఢిల్లీ,జూలై9(జ‌నం సాక్షి): ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటు సర్వసాధారణం అయినా ప్రజలంతా తమకు ఏదో బాగు జరగాలన్న లక్ష్యంతో ఓటేస్తారు. ఎవరో ఒకరిని గద్దెనెక్కించేందుకు కాదని గుర్తు చేసుకోవాలి. బిజెపి మాత్రమే ఏదైనా చేయగలదన్న నమ్మకంతో ఉన్న ప్రజల ఆశలు వమ్ము అవుతున్న వేళ మేల్కోక పోతే పుట్టి మునగడం ఖాయం. ఇదే ఆందోళనలో ప్రస్తుతం బిజెపి నాయకుల ఉన్నారు. డిమానిటైజేషన్‌, జిఎస్టీ పుట్టి ముంచబోతోందని ఓ వర్గం ఆందోళన చెందుతున్నా మోడీ వర్గం మాత్రం దానిని తురుపు ముక్కగా అభివర్ణిస్తోంది. దీంతోనే మంచి జరిగిందన్న మొండివాదన చేస్తున్నారు.ప్రజలు ఎన్నో ఆశలతో బిజెపికి అందలం ఎక్కిస్తే అందుకు అనుగుణంగా కిందిస్థాయిలో హావిూలు నెరవేరి ప్రజలు బాగుపడుతున్నారా లేదా అన్నది కిందిస్థాయిలో నేతలు చూడాలి. ప్రధాని నరేంద్రమోదీ నవభారతాన్ని ఆవిష్కరిస్తామని, పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేస్తామని అంటున్న మాటలు నిజం కావడం లేదని అంతర్గత వేదికల ద్వారా తెలియ చేయాలి. ఇచ్చిన హావిూల మేరకు పాలకులు అందుకు తగ్గట్లుగా ప్రజలకు సేవ చేయగలగాలి. పేదలు, అణగారిన వర్గాలు తమ జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దుకునే దేశాన్ని తయారు ఏయాలన్న సంకల్పం నెరవేరాలంటే పథం మారాలి. బిజెపిని నమ్మి ఓటేశారని స్పష్టంగా గుర్తించాలి. ప్రధాని మోడీ ప్రజల సమస్యలను తెలుసుకుని ముందుకు సాగాల్సి ఉంది.ఈ మేరకు ఆయా రాష్టాల్రకు లక్ష్యాలను నిర్దేశించి ముందుకు నడిస్తేనే చెప్పిన మాటలకు, ఇచ్చినహావిూలకు విలువ ఉంటుంది. ఈ దేశంలో పేదలు తమకోసం ఏదో ఒకటి జరగాలని,మార్పు రావాలని కోరుకుంటున్నారు. తమకు కొత్త అవకాశాలు రావాలని, తమ బతుకులు బాగు పడాలని చూస్తున్నారు. దీనిని ప్రతిసారీ ఎన్నికల ఫలితాల రూపంలో తెలియ చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. వాగ్దానాలు చేయడం వాటిని మరవడం సరికాదు. అందువల్ల ప్రజల ఆకాంక్షలను నిరంతరం నెమరువేసుకునేలా నాయకులు ఉండాలి. ఎన్నికల్లో ప్రజాతీర్పునకు అనుగుణంగా పాలకులు నడుచుకుని ఉంటే పేదల ఆకాంక్షలు నెరవేరడానికి ఇంతకాలం పట్టేది కాదు. ఇచ్చిన హావిూలు నెరవేర్చడం అన్నది కష్టతరమే కాకుండా క్లిష్టం కూడా. దేశ భవిష్యత్తు నిర్మాణంలో పేదలకు ఎంత అధికంగా అవకాశం లభిస్తే దేశం అంత వేగంగా ముందుకెళ్తుంది. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి సరికొత్తగా వెలుగు లీనుతూ ఉన్నత శిఖరాలను అందుకునే దేశంగా అవతరించాలన్న ప్రధాని సంకల్పాన్ని నిజం చేసేలా కార్యాచరణ కూడా చేసుకోవాలి. పేదలకు విద్య లభిస్తే సమాజంలో భారీ మార్పులు వస్తాయి. వారికి ఎంత ఎక్కువ అవకాశాలు కల్పిస్తే దేశానికి అంత ఎక్కువ చేసి చూపిస్తారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు చాలాభారం భరించాల్సి వస్తోంది. మొత్తం ఆర్థిక భారం మధ్య తరగతి వారే భరిస్తున్నారు. వారిపై భారం తగ్గాలి. ఒకసారి పేదలకు వారి భారాన్ని ఎత్తుకొనే శక్తి వస్తే దేశంలోని మధ్యతరగతి ప్రజలపై ఉన్న భారం దానంతట అదే తగ్గిపోతుంది. పేదల కొత్త శక్తి, మధ్య తరగతి కలలను సమ్మిళితం చేస్తే ఈ దేశం కొత్త ఎత్తులకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరని పదేపదే అంటున్న ప్రధాని మోడీ మాటలకు ఆచారణ రూపం రావాలి. ఇటీవలి పెద్దనోట్ల రద్దు కారణంగా ఎందరనో పేదమధ్య తరగతి ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. ఇవి ఇక్కట్లే కాదు. వారి ఆర్థికప్రగతిని కుంగదీసింది. దీనిపై అంచనా వేయలేదు. ఆ తరవాత ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. మన దేశంలో ఎన్నో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రజలు తమ భావోద్వే గాలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో తమ తీర్పు ద్వారా ఆకాంక్షలు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటులో ఉన్న ఆసక్తి ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో కూడా ఉండాలి. బిజెపిని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా నిలబెట్టారు. ఇంతకు మించిన త్యాగం ఇక ప్రజలు చేయలేరేమో. కాబట్టి మోడీ తన ఆలోచనలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ చేసి ముందుకు సాగాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం ద్వారా సాగాలే తప్ప కొత్త సమస్యలు సృష్టించరాదు. బ్యాంకుల్లో వడ్డనలను రద్దు చేయడం ద్వారా ప్రజలకు వాటిని మరింత చేరువ చేయాలి. వాటిని సర్వీస్‌ సెక్టార్‌ కిందకు తీసుకుని రావాలి. ఇలాంటివన్నీ విశ్లేషించుకుంటేనే ముందుకు సాగుతారు. దేశానికి ఎంతోకొంత చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లాలి. 125 కోట్ల మంది ప్రజలను కలుపుకొని నవభారత్‌ రూపకల్పనకు ముందుకు కదలాలి. 2022 నాటికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే సంకల్పంతో ముందుకెళ్లాలన్న సంకల్పానికి కార్యాచరణ ఉండాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో గమనించాలి. లోపాలుంటే సరిదిద్దుకొని ముందడుగు వేస్తామని సంకల్పం తీసుకోవాలి. బిజెపి చేస్తున్న యాత్రల్లో ఇలాంటి స్పష్టత కానరావడం లేదు.