ప్రజల పక్షాన నిలిచిన సుప్రీం !
ఆ మధ్య పెగాసస్ వ్యవహారంపై పార్లమెంటులో దుమారం చెలరేగినా..ప్రభుత్వం కించిత్ కూడా స్పందించ లేదు. ప్రధాని మోడీ అయితే పార్లమెంటుకు రాకుండానే దాటవేశారు. మంత్రులు కూడా అలాగే సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. సరికదా అలాంటి వ్యవహారం ఏదీ లేదని నిర్ద్వందంగా తెలిపింది. పెగాసస్‌కు ప్రబుత్వానికి సంబంధం లేదని తెలిపింది. అంతేనా అంటే సుప్రీం కోర్టుకు నిజాలు చెప్పేందుకు నిరాకరిం చింది. దేశభద్రత అంటూ పెద్దపెద్ద మాటలతో దాటవేత ధోరణిని ప్రదర్శించింది. ఈ వ్యవహారంలో విపక్షాల ఆందోళనలకు కనీసం బాధ్యతాయుతమైన సమాధానం ఇవ్వలేదు. అంతేగాకుండా ఉన్నత న్యాయస్థానంను కూడా విశ్వాసంలోకి తీసుకోలేదు. ఇకపోతే పెగాసస్ వ్యవహారంపై ఇజ్రాయిల్ కూడా పెద్దగా స్పందించ లేదు. అది భారత్ అంతర్గత వ్యవహారంగా ప్రకటించింది. ఈ క్రమంలో సుప్రీం స్పందించి కమటీ వేయడం అన్నది విపక్షాలకు దక్కిన విజయంగానే చూడాలి. అందుకే రాహుల్ తదితరులు దీనిపై స్పందించి.. విపక్షాల వాదనలో నిజం ఉందని సుప్రీం కమిటీతో తేలిందన్నారు. ఈ క్రమంలో గోప్యత విషయంలో సుప్రీం చేసిన వ్యాఖ్యలు పౌరుల ప్రాథమిక హక్కుకు సంబంధించినవి. పెగాసస్ నిఘా వ్యవహారంవిూద దర్యాప్తు చేయడానికి ముగ్గురు స్వతంత్ర నిపుణుల కమిటీని సుప్రీంకోర్టు నియమించడం ప్రభుత్వానికి చెంపపెట్టు కాగలదు. చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసం తీసుకున్న నిర్ణయం స్వాగతించ వలసిందే. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కమిటీని ఏర్పాటు చేయవలసి వచ్చిందంటూ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే సందర్భంలో దేశపౌరులపై నిఘాను ఏమాత్రం అనుమ తించేది లేదని కూడా తెలియచేసింది. ఇక్కడ మనమంతా ఓ విషయం గమనించాలి. పౌరుల గోప్యత విషయంలో సుప్రీం చాలా సీరియస్‌గా వ్యవహరించిందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పౌరుల స్వేచ్ఛ కు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వాలకు అయినా మక్కు లేదు. ఈ క్రమంలో ఇజ్రాయిల్‌కు చెందిన నిఘా సంస్థకు చెందిన పెగాసస్ నిఘా పెట్టడంపై విపక్షాలు పార్లమెంటును స్తంభింప చేసాయి. అయితే అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని ప్రభుత్వం కూడా గట్టిగా చెప్పలేకపోవడంతోనే అనుమానాలు బలపడ్డాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీ పెగాసస్ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించి, వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అన్నది నిర్థారిస్తుంది. ఈ నిఘా వ్యవహారంపై సుప్రీం కోర్టు తన ప్రత్యక్ష పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపి తీర్పును గతంలోనే రిజర్వులో చేసిన విషయం తెలిసిందే. త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు సంబంధించిన అవకాశం ఉన్నదని అప్పట్లోనే ప్రధాన న్యాయమూర్తి సూచనప్రాయంగా తెలియ చేశారు. కమిటీని ప్రకటిస్తూ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత ఇత్యాది అంశాలపై న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఎంతో విలువైనవి. దేశభద్రత, దేశద్రోహం అనే ఆయుధాలను ప్రయోగించి తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని పాలకులు ఎల్లవేళలా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే పెగాసస్ వ్యవహారం దుమారం రేపింది. అలాగే దేశద్రోహం కింద కూడా గతంలో సుప్రీం ధర్మాసనం తీవ్రంగానే స్పందించింది. ఎప్పుడో బ్రిటిష్ హయాంలో జరిగిన చట్టాన్ని ఇంకా దుర్వినియోగం చేయడంపై ఘాటు గానే వ్యాఖ్యానిస్తూ దానిని రద్దు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఇదే సందర్భంలో పాలకుల ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్న వారిని వేయికళ్ళతో కనిపెట్టడానికి పెగాసస్ వంటివాటిని ఉపయోగించి నట్లు ఆరోపణలు రావడంతో దేశంలో దుమారం చెలరేగింది.
మేధావులు, మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, పాత్రికేయులు ఇత్యాది అనేకరంగాలకు చెందిన ఎంతోమందివిూద నిఘాను ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. పార్లమెంటు వేదికగా రచ్చ జరిగింది. అయితే ఇంత జరిగి..గుట్టు రట్టయిన తరువాత బీజేపీ పెద్దలు దానిని అబద్ధం అంటూ తప్పించుకో జూశారు. కానీ సుప్రీం మాత్రం దీనిని సీరియస్‌గానే తీసుకుంది. పౌరులపై నిఘా, అందులో విదేశీసంస్థల ప్రమేయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ప్రభుత్వం కనీస స్పందన కూడా కానరాలేదు. దీంతో ప్రభుత్వంపై సహజంగానే అనుమానాలు వచ్చాయి. ఈ స్థితిలో దీనిపై తీసుకున్న చర్యలేమిటో తెలియచేయమని కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు అవకాశం ఇచ్చిన విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. ప్రభుత్వం ఏమాత్రం వివరాలు చెప్పకుండా, అస్పష్టమైన, అసంపూర్ణమైన అఫిడవిట్ సమర్పించినందున కమిటీ ఏర్పాటు నిర్ణయానికి తాము రావలసి వచ్చిందని న్యాయస్థానం పేర్కొన్న తీరు కూడా మోడీ ప్రభుత్వ నిరల్‌క్ష్య ధోరణిని చూడవచ్చు. దేశభద్రత రీత్యా సమాచారాన్ని ఇచ్చేది లేదన్న కేంద్రం వాదనను న్యాయస్థానం ఘాటుగానే స్పందించింది. దాన్ని అడ్డుపెట్టుకొని పౌరహక్కులూ స్వేచ్ఛకు భంగం వాటిల్లే చర్యలకు ఉపక్రమించడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయ పడిరది. కోర్టుకు ఆ సమాచారం ఇచ్చినప్పుడు దేశభద్రతకు ప్రమాదం వాటిల్లుతుందనడానికి తగిన ఆధారాలుండాలి తప్ప, అడిగినప్పుడల్లా అదేమాటతో న్యాయస్థానాల నోరు మూయించగలమనుకోవడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. స్పైవేర్ దుర్విని యోగం, వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని పిటిషన్ దారులు అంటున్నప్పుడు, దానిని ఉపయోగించామా లేదా అన్నది ప్రభుత్వం చెప్ప నప్పుడు నిజాన్ని నిగ్గుతేల్చగలిగే కమిటీ ఏర్పాటు తప్ప మరోమార్గం లేదని న్యాయస్థానం అభిప్రాయ పడిరది. అయితే ఇక్కడ మోడీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పూర్తి నిర్లక్ష్యం కనబర్చింది. పెగాసస్ వ్యవహారంపై పెద్దగా స్పందించాలన్న ధోరణి ప్రకటించలేదు. సరికదా అందిరికి చెప్పినట్లుగానే యథాలాపంగా సుప్రీం కోర్టు ముందు కూడా లేదు అన్న తీరులో సమాధానం ఇచ్చింది. సుప్రీంకోర్టు నిర్ణయం ఓ రకంగా చూస్తే ప్రజల స్వేఛ్ఛను కాపాడేం దుకు తీసుకున్న రక్షణ కవచంగా చూడాలి. పౌరుల విషయంలో పాలకుల నిరంకుశ ధోరణిని ఎండగట్టేదిగా చూడాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్నీ, పౌరహక్కులనూ కాపాడవలసిన పాలకులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం వల్లనే ఇవాళ న్యాయస్థానాలు ప్రజల పక్షాన ముందుకు రావడం విశేషం.