ప్రజల రక్షణకోసమే కార్డన్‌ సెర్చ్‌ 

– అదిలాబాద్‌ ఎస్పీ శ్రీవిష్ణు వారియర్‌
– పట్టణంలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌
అదిలాబాద్‌, జులై25(జ‌నంసాక్షి) : కార్డన్‌ సెర్చ్‌ తో ప్రజల మధ్య నివాసముండే  దొంగలను, దోపిడీదారులను గుర్తించి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు అదిలాబాద్‌ జిల్లా ఎస్పీ శ్రీవిష్ణు ఎస్‌ వారియర్‌ అన్నారు.  జిల్లా కేంద్రంలోని స్థానిక ఖానాపూర్‌ కాలనీలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీవిష్ణు ఎస్‌ వారియర్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రతి నివాస సముదాయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 23 బైక్‌లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానికులతో ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణగా నిలిచేందుకు పోలీస్‌శాఖ అప్రమత్తంగా పనిచేస్తుందన్నారు. ప్రజలుకూడా పోలీసులకు సహకరించాలని, తద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ప్రజల మధ్యనే ఉంటూ నేరాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు కార్డెన్‌ సర్చ్‌ లు నిర్వహిస్తున్నామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులు వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానిక ప్రజలకు ఎస్పీ సూచించారు. పోలీస్‌శాఖలో చేరడానికి అర్హత ఉన్న నిరుద్యోగ యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఆసక్తి కలిగిన యువత చేరవచ్చన్నారు. అదేవిధంగా పోలీస్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నేరాలను అదుపు చేయడానికి సీసీ టీవీలు ఏర్పాటు చేసుకునే విధంగా కాలనీల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గస్తీ, పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

తాజావార్తలు