ప్రజాకూటమికి బ్రహ్మరథం

ఎనభైకి పైగా సీట్లలో విజయదుందుభి
వరంగల్‌ అర్బన్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి ప్రభంజనం వీచిందని ప్రజలు ప్రజా కూటమికి బ్రహ్మారథం పట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రమంతా ప్రజలు ఆత్మాభిమానం చాటారని, నిరంకుశ ప్రభుత్వాన్ని పారదోలాలని నిర్ణయించి ఓటేశారని అన్నారు. కెసిఆర్‌ వైఖరిపై ప్రజలు ఆగ్రమంగా ఉన్నారని ఓటర్ల నాడి తెలియచేసిందన్నారు.  భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ఆయన మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా కూటమికి ఎనభైకి పైగా సీట్లలో విజయదుందుభి మోగిస్తుందన్నారు. కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తారని గత ఎన్నికల ముందు హవిూలు ఇచ్చారన్నారు. కానీ నాలుగున్నర సంవత్సరాల కాలంలో కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడంతో ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రజాకూటమికి బ్రహ్మరథం పట్టారన్నారు. గత ఎన్నికల్లో ఒకట్రెండు సీట్లు వచ్చిన కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలో ఈసారి సగానికి పైగా సీట్లు సా ధిస్తుందన్నారు. హైద్రాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఈ సారి ప్రజా కూటమి పెద్ద ఎత్తున సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు.కొన్ని జిలాల్లో ప్రజా కూటమి క్లీన్‌ స్వీప్‌చేసే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్‌, సీపీఐ, టీడీపీ,టీజేఎస్‌ల కలయికతో ప్రజా కూటమిగా ఏర్పడి ప్రజల్లోకి వెళ్లిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రజా కూటమిని ఆదరించి భారీ ఎత్తున ఓట్లు వేశారన్నారు. ప్రజా కూటమి ఇచ్చిన హవిూలు, ఎన్నికల మెనిఫెస్టోతో అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేసి ఓట్లు వేశారన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు నిరుద్యోగ భృతితో పాటు సంవత్సరంలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హవిూని నిరుద్యోగులు విశ్వసించారన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని హవిూ ఇచ్చిన నాలుగు దఫాల్లో రుణమాఫీ చేయడంతో రైతులు టీఆర్‌ఎస్‌ పట్ల విముఖత చూపారన్నారు.ప్రజాకూటమి రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ప్రకటించడంతో రైతులు ప్రజాకూటమికి బాసటగా నిలిచారన్నారు. ఇలా అన్ని వర్గాలు ప్రజా కూటమికి మద్ధతు తెలుపడంతో ప్రజా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల స మావేశంలో సీపీఐ మండలకార్యదర్శి ఆదరి శ్రీనివాస్‌, మండల కాం గ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జిమ్మల భీంరెడ్డి, నాయకులు సుదర్శన్‌రెడ్డి, ఆదరి రవీందర్‌, కాసగోని బాలకృష్ణగౌడ్‌, శ్రీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.