ప్రజాకూటమిగా మారిన పేరు
మహాకూటమి నేతల నిర్ణయం
హైదరాబాద్,అక్టోబర్13(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ను ఓడించటమే లక్ష్యంగా ఏర్పడ్డ మహాకూటమి ఇప్పుడు ప్రజా కూటమిగా పేరు మార్చుకుంది. కూటమిలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలున్నాయి. ఇంతకాలం ఈ కూటమి మహాకూటమిగా వ్యవహరిస్తూ వస్తోంది. అయితే దీని పేరు మార్చాలన్న ప్రతిపాదన ముందే వచ్చింది. దీంతో ఇప్పుడు మహాకూటమికి ప్రజాకూటమిగా పేరు మార్చారు. ఈ కూటమిపై అనేక విమర్శులు కూడా వచ్చాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఎలా పెట్టుకుందని పలువురు ప్రశ్నించారు. రాజకీయాలల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులుండరని ఈ పార్టీలు నిరూపించి ఐక్యతారాగం ఆలపించి ఓకే వేదికపైకి కావడం గమనార్హం. ప్రజాకూటమిని ప్రజలు ఆదరిస్తారని, టీఆర్‌ఎస్ ఓటమి ఖాయమని ఆ పార్టీలు ధీమాతో ఉన్నాయి. ప్రస్తుతం వస్తున్న సర్వేల వివరాల ప్రకారం రాష్ట్రంలో మహాకూటమి 80కి పైగా స్థానాలను గెలుచుకోనుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ 30 స్థానాలకు పరిమితమవుతుందన్నారు. కూటమి భాగస్వామ్య పార్టీలతో చర్చలు మంచి వాతావరణంలో జరుగు తున్నాయని, ఒకటి రెండు రోజుల్లో సీట్ల సర్దుబాట్లపై స్పష్టత వస్తుందని తెలిపారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో కూడా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. తాము పోటీ చేయదలిచిన సీట్లపై టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కసరత్తు పూర్తి చేసి ప్రతిపాదిత జాబితాను కాంగ్రెస్‌కు అందజేశాయి. అందులో టీడీపీ 15, సీపీఐ12, టీజేఎస్ 25 స్థానాలకు సంబందించిన నియోజకవర్గాలు, అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ముందుంచినట్లు తెలుస్తోంది. టీజేఎస్ మాత్రం కొన్ని ప్రత్యేక షరతులు పెట్టినట్లు సమాచారం. కూటమికి కామన్ ఎజెండా రూపొందించాలని, అధికారంలోకి వస్తే ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి దానికి చట్టబద్దత కల్పించాలని, దానికి కోదండరాంను చైర్మన్ చేయాలన్న కండిషన్ పెడుతున్నారు. అదలా ఉంచితే
పొత్తుల్లో ముఖ్య భూమిక పోషిస్తోన్న టీడీపీ ఏ స్థానాలను కోరుతున్నదనేది ఇప్పుడు టాపిక్‌గా మారింది. టీడీపీ 30 స్ధానాలు కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్ధులు లేని సీట్లనే టీడీపీ కోరుతోంది. దీనికి సంబంధించి మొత్తం 19 నియోజకవర్గాల అభ్యర్ధుల పేర్లను కాంగ్రెస్ పెద్దల ముందుంచారు. మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లలందరికి టికెట్లు దక్కెలా జాబితా రూపొందించారు.