ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తానన్న శంకర్‌రావు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ నేపథ్యంలో మాజీమంత్రి శంకర్‌రావు బషీర్‌బాగ్‌ చౌరస్తాలో కాసేపు హంగామా సృష్టించారు. హైదర్‌గూడ నుంచి తన వాహనంలో భాజపా, తెరాస మహిళా నాయకులను తన వాహనంలో ఎక్కించుకుని అసెంబ్లీకి బయలుదేరారు. చాకచక్యంగా పలు బారికేడ్లను దాటుకుని వచ్చిన శంకర్‌రావు చివరకు బషీర్‌బాగ్‌ చౌరస్తా పోలీసుల కంటపడ్డారు. కారులో వివిధ పార్టీ కండువాలు చూసి పోలీసులు మహిళలను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో మహిళలు అసెంబ్లీవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతోందని శంకర్‌రావు ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కర్వ్యూ కన్నా దారుణమైన పరిస్థితిని నెలకొల్పాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. సీఎం చర్యల వల్ల అత్యవసర సేవలు నిలిచిపోయాయని శంకర్రావు అన్నారు. ఈ విషయంపై హైకోర్టులో సీఎం, డీజీపీ, హోంమంత్రిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు తెలిపారు.