ప్రజావ్యతిరేకతను చాటిచెప్పిన జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు !

     మద్యం ఏరులైపారిన,సంచులకొలది డబ్బులు పంచిన,ఓటర్లను ఆకర్షించడానికి మేనిఫెస్టో ద్వారా ఎన్నిరకాల హామీలు ఇచ్చిన,ఎన్నికల సమయంలో వేయాల్సిన ఎత్తుగడలు ఎన్నివేసిన,ప్రజలను కొంత భయాందోళనలకు గురిచేసి ఓటింగ్ శాతాన్ని తగ్గించడంలో కొంతవిజయం సాధించిన, ఎలాగైనా ఓటర్లను తమ జిమ్మిక్కులతో మసిపూసి మారేడుకాయ చెయ్యొచ్చులే అనుకున్నా,ప్రజాతీర్పు ఎలా ఉంటుందో మరొకసారి ఓటరు మహాశయులు ఈఎన్నికలలో చాటిచెప్పారనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
    ఇందులో కేవలం పాలకపక్షంపై వ్యతిరేకత ఏమేరలో కొనసాగుతుందో రుజువు చేశారని చెప్పవచ్చు.ఎంతపెద్ద పార్టీ అయినా,ఎలాంటి నాయకుడయినా ప్రజాతీర్పుకు తలవంచక తప్పనిపరిస్థితిని చాటిచెప్పిందని చెప్పకతప్పదు.ఇక్కడ భారతీయ జనతాపార్టీ 2016 ఎన్నికలలో నాలుగు సీట్లు సాధించగా, 2020 ఎన్నికలలో 48 సీట్లు సాధించిన, మొన్నజరిగిన దుబ్బాక శాసనసభ ఉపఎన్నికలలో రఘునందన్ విజయం సాధించిన కారణం… కేవలం ప్రజలు పాలకపక్ష పనితీరుపై వెల్లడిస్తున్న అసంతృప్తి అన్నది ముమ్మాటికి వాస్తవం.ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఒక ఆసక్తికరమైన విషయం నెలకొంది.పోలైన  ఓట్లలో భారతీయ జనతా పార్టీ 12,13,900 ఓట్లను కలిగి,31.43 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ రాష్ట్రసమితిపార్టీ 11,89,250 ఓట్లను పొంది 30.79 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది.అలాగే అధికారపార్టీ సాధించిన 55 సీట్లలో 27 సీట్లు హైదరాబాదులో శాశ్వతనివాసం ఏర్పరుచుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులు కావడం గమనార్హం. అంటే ఈ ఎన్నికలలో అధికార పార్టీపై ఇంత వ్యతిరేకత రావడానికి వరదల ప్రభావంతో తీవ్ర ఇబ్బందులతో బాధపడుతున్న తరుణంలో సహాయకచర్యలు చేపట్టడంలో సర్కారు నిర్లక్ష్యం వహించడం,రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం,మురికికాలువల పునరుద్ధరణ, రహదారుల మరమ్మతు,సిట్టింగ్  కార్పొరేటర్ లపై ఉన్న అవినీతిఆరోపణలు మరొక కారణమయ్యాయని చెప్పవచ్చు.
  అధికారంలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు మంత్రులకు ఇవ్వాల్సిన అధికార బదలాయింపులు  ఇవ్వకుండా ఒకరిద్దరి చేతుల్లోనే నిర్ణయాధికారం ఉండటం అనేది ప్రజలు గమనిస్తూవస్తూ ఉన్నారు.మేము ఏమిచెప్పినా అదే శిరోధార్యం అనే నియంతృత్వ పోకడకు ఈఫలితాలే నిదర్శనం అని చెప్పకతప్పదు.
    యావత్ తెలంగాణ ప్రజానీకం ఏకమై మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని,ఎన్నోఆశలతో ప్రత్యేకరాష్ట్రాన్ని ఏర్పర్చుకొని ఎదురుచూడగా గత ఆరున్నర  సంవత్సరాల పరిపాలనకాలంలో ఆశించిన అభివృద్ధి జరగలేదన్నది వాస్తవం.ప్రత్యేకంగా ఉద్యమంలో కీలకపాత్ర పోషించినది కేవలం విద్యార్థులు,నిరుద్యోగులు కానీ వారు బ్రతుకులు ఎండమావిలా తయారయ్యాయి.ఉద్యమపార్టీగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్ర సమితిపార్టీ నీళ్లు,నిధులు,నియామకాలు అనేనినాదంతో అధికారం చేపట్టాక ఎలాంటి కొలువులు చేపట్టకపోగా నిరుద్యోగితను పెంచిపోషించిందని చెప్పవచ్చు.అలాగే ఉద్యోగులపాలిట గుదిబండగా మారింది.తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినవారిని దూరంగాపెడుతూ ఆనాడు ద్వేషించిన ఇతరపార్టీ నాయకులను తమపార్టీలో చేర్చుకుని పదవులు ఇచ్చి,రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండాచేసి,తన కుటుంబంలోనే పలువురికి రాజకీయ పదవులు అప్పగించి పాలనకొనసాగించిన… తెలంగాణ ప్రజలు మరొకసారి ఆశీర్వదించి పాలకపగ్గాలు అప్పగించారు.కానీ నిరుద్యోగుల మరియు ఉద్యోగుల విషయంలో ఎలాంటి మేలు చేకూర్చకపోవడం,విద్యావ్యవస్థను సరైనరీతిలో పట్టించుకోకపోవడం,ఎన్నికల సమయాలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలై ప్రత్యామ్నాయ పార్టీకోసం ఎదురుచూస్తున్న తరుణంలో భారతీయ జనతాపార్టీ ఆశాజనకంగా కనిపించి ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారని చెప్పవచ్చు.
     అందులో భాగంగానే ఈఒక్క సంవత్సరంలోనే జరిగిన ఎన్నికలలో పార్టీ పుంజుకుంటున్న తీరు నిదర్శనం.ప్రజలలో కొనసాగుతున్న అసంతృప్తిని చూస్తుంటే త్వరలో జరగబోయే వరంగల్ మరియు ఖమ్మం మున్సిపాలిటీ ఎన్నికలు, నాగార్జునసాగర్ శాసనసభ ఉపఎన్నిక మరియు 2 గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికలలో ఎలాంటి ఫలితాలు వస్తాయో అంచనా వేయవచ్చు.
     ఇప్పటికైనా ఈప్రభుత్వంలో నిరుద్యోగుల అవస్థల గురించి శాస్త్రీయమైన విశ్లేషణ గావించాల్సిన అవసరం ఎంతైనాఉన్నది. కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకులు బజారున పడి,దుఃఖసాగరంలో మునిగిపోయాయి.వారిగురించి ఆలోచించి శాశ్వత పరిష్కారం సూచించాల్సినవసరం కూడా ఉన్నది.అలాగే ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన చట్టాలు,పథకాల గురించి పునరాలోచించి,ప్రజలకు ఏవిధంగా ఉపయోగ పడుతున్నాయో సరిచూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనాఉన్నది.అంతకంటే ముందు జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను తూ.చా తప్పకుండా నెరవేరుస్తూ ముందుకెళ్లాలి. లేనిచో వచ్చేఎన్నికల్లో ఇలాంటి ఫలితాలను రుచిచూడటమే కాకుండా రాబోయే 2023 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఆశ్చర్య పడనక్కరలేదు.
    ప్రజలు ప్రతివిషయాన్ని గమనిస్తూ, అవసరం వచ్చినప్పుడు ఎలాంటి తీర్పునిస్తారో గతంలో ఎన్నోసార్లు రుజువుకాగా,మరొకసారి పునరావృతం అయ్యిందని చెప్పవచ్చు.అందుకే రాష్ట్రంలో ప్రజానుకూల పనులను చేపడుతూ,పలుసమస్యల పరిష్కార మార్గాలను కనిపెడుతూ,నిస్వార్థంగా, నిస్పక్షపాతంగా అమలుపరుస్తూ అభివృద్ధివైపు అడుగులు వేయాల్సిన తరుణం ఆసన్నమయ్యింది.ఇప్పటికైనా అధికార ప్రభుత్వం తమ ఫలితాలను విశ్లేషించుకుని,ప్రతిపక్షానికి విలువనిస్తూ, ప్రశ్నించేతత్వాన్ని గౌరవిస్తూ,కుటుంబ పాలనకు స్వస్తి పలుకుతూ ముందడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.లేనిచో భవిష్యత్తులో తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
   భారతీయ జనతాపార్టీ సైతం పుంజుకుంటున్న తీరునుచూసి సంబర పడిపోకుండా ప్రజాసమస్యల పరిష్కారానికి పూనుకోవాలి.ఎందుకంటే ప్రజలు ఆదరిస్తున్నారు అంటే కారణం..వారిపైనున్న ప్రేమకంటే రాష్ట్రంలో అధికారపార్టీపైన ఉన్న వ్యతిరేకతన్న  విషయాన్ని మరవకుండా ముందుకువెళుతూ,ప్రజల పక్షాననిలుస్తూ, వారి ఆదరాభిమానాలను శాశ్వతంగా పొందటానికి కృషిచేయాలి.అప్పుడే వారనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి.ఏదిఏమైనా ఇప్పటినుంచైనా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగి, అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం.
             డా.పోలం సైదులు ముదిరాజ్,
                      9441930361.