ప్రజాస్వామ్యంలో ప్రజలే నిరంకుశులు
వారిని నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటు తప్పదు
బెంగాల్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే జరిగింది
హైదరాబాద్,డిసెంబర్12(జనంసాక్షి): తాను పుట్టి పెరిగిన పార్టీలను అణగదొక్కడంలో కెసిఆర్ ఎలాంటి వెనకడుగు వేయలేదని రాష్ట్ర రాజకీయాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్, టిడిపిలు తెలంగాణలో ఉనికి లేకుండా పోవాలని కెసిఆర్ వేసిన ఎత్తుగడలు ఫలించాయి. ఆయన దెబ్బకు టిడిపి ఉనికిలేకుండా పోయింది. అలాగే కాంగ్రెస్ ఇప్పుడు అదే దారిలో ఉంది. బెంగాల్లో కమ్యూనిస్టులు ఇదే ధోరణిలో 30 ఏళ్లపాటు రాజ్యమేలారు. తమకు తిరుగు లేదన్న ధోరణిలో వారు ప్రజల ఆశలను,ఆకాంక్షలను పట్టించు కోలేదు. తమ నిరంకుశ పాలనకు ప్రజాస్వామ్యం, అభివృద్ది ముసుగేసారు. కానీ అక్కడా మమతా బెనర్జీ లాంటి వారు పుట్టుకుని వచ్చారు. కమ్యూనిస్టులను కూకటి వేళ్లతో పెకిలించారు. అయితే ఆమె కూడా అదే ధోరణిలో నిరంకుశ పాలన సాగించడంతో ఇప్పుడు మమతా బెనర్జీ పునాదులు కూడా కదులుతున్నాయి. బిజెపి అక్కడ చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారు. నిరాశా నిస్పృహలతో ఉన్న మమతా బెనర్జీ బిజెపి నేతలపై దాడులకు దిగుతోంది. గూండార్జాన్ని తలపించేలా చేస్తోంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాపై జరిగిన దాడి, కారు ధ్వంసం వ్యవహారాన్ని ఆషామాషీగా తీసుకోవడానికి లేదు. ఇది డ్రామాగా అభివర్ణించడం మమతా బెనర్జీ తలకెక్కిన గర్వంగా చూడాలి. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సిఎం చేతుల్లో ఉంటుంది. ఓ జాతీయ నాయకుడు వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండకుండా అదంతా వారి సృష్టేనని చెప్పడం ద్వార ఆఅహంకారన్ని ప్రదర్శించారు. అలా చేస్తూ పోవడం వల్ల్నే ఇప్పుడు ఆమె సొంతపార్టీ నేతలే పార్టీని వీడుతున్నారు. అధికార గర్వంతో ఆమె ఏమి మాట్లాడుతారో తెలియదు. అక్కడా ఆమె నిరంకుశత్వం అటు ప్రజలకు, ఇటు పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. అందుకే వారు కూడా మమతను ఇంటికి పంపించాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక తెలంగాణల కూడా తొలుత తెలుగుదేశం పార్టీని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని కోలుకోకుండా దెబ్బతీసిన కేసీఆర్, ఇప్పుడు బీజేపీ రూపంలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందిన ఊహించి ఉండకపోవచ్చు. పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏ తప్పు చేశారో తెలంగాణలో కూడా కేసీఆర్ అదే తప్పు చేస్తున్నారు. పశ్చిమబెంగాల్లో బలంగా ఉన్న వామపక్షాలను మమతా బెనర్జీ బలహీనపరిచారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో ఇప్పుడు భారతీయ జనతాపార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. తెలంగాణలో కూడా ఇదే జరిగింది. గ్రేటర్లో గత ఎన్నికలలో కేవలం పది శాతం ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ తాజా ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ కంటే అధికంగా ఓట్లు సాధించింది. బీజేపీ ఇంతలా బలం పుంజుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల తరఫున ఎవరైనా ఏ ఎన్నికల్లోనైనా గెలిస్తే వారిని తమ పార్టీలోకి కలిపేసుకుంటూ వచ్చిన కేసీఆర్ బీజేపీకి చెందిన వారిని మాత్రం ఆకర్షించలేకపోయారు. అలాగే వారికి పునాదే లేదన్న ధోరణి ప్రదర్శించారు. కానీ ప్రజల్లో నిరసనలు నివురుగప్పితే నాయకుడు ఏ పార్టీలో అయినా పుట్టుకుని వస్తారని గమనించలేదు. ఈ కారణంగా కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం కావాలనుకున్న వారికి బీజేపీనే కనిపిస్తున్నది. గ్రేటర్ ఎన్నికలలో కమలనాథుల బలం అనూహ్యంగా పెరగడానికి ఇదే ప్రధాన కారణం. మోదీ,అమిత్‌షా నేతృత్వంలోని బీజేపీ గతంలో అద్వానీ,వాజ్‌పేయిల ఆధ్వర్యంలో ఉన్న బిజెపికి భిన్నం. తెలంగాణ బిజెపిలో ఇప్పుడు నాయకత్వం కూడా బలంగా ఉంది. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దూకుడు పెంచి టీఆర్ఎస్ను తమ ఉచ్చులోకి లాగారు. ప్రజల్లో గూడు కట్టుకుంటున్న అసంతృప్తిని పసిగట్టడంలో టీఆర్ఎస్ నాయకత్వం విఫలమైంది. అలాగే టిఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని మచ్చుకు కూడా కనిపించకుండా అంతా తామే అన్నట్టుగా కెసిఆర్, కెటిఆర్ వ్యవహారాలు నడుపుతున్నారు. ప్రగతిభవన్ ఛాయలకు ఎవరు రాకుండా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపిలకు కూడా పర్మిషన్ ఉండాల్సిందే. అంతెందుకు ఓ పర్యాయం బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కెసిఆర్ అపాయింట్మెంట్ దొరకడం లేదంటే …కెసిఆర్ అసెంబ్లీ వేదికగా చాలా నిరంకుశ ధోరణితో సమాధానం ఇచ్చారు. అధికారం అంతా ఒక కుటుంబం వద్దనే కేంద్రీకృతమై ఉండటాన్ని కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా విూడియాను, అధికార యంత్రాంగాన్ని భయపెట్టి లొంగదీసుకుని అనుకూల ప్రచారం పొందడానికి అలవాటుపడిన కేసీఆర్ చిన్నపాటి విమర్శను కూడా స్వీకరించలేని స్థితికి చేరుకున్నారు.
అధికారిక సమావేశాలలో కూడా తాను మాత్రమే గంటల తరబడి మాట్లాడుతూ ఇతరులకు మాట్లాడే అవకాశం ఇవ్వరన్న విమర్శలు ఉన్నాయి. ఓ పర్యాయం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ఆనాటి ఎంపి సీతారాం నాయక్ మాట్లాడుతుండగా వేదిక నుంచి ప్రసంగాన్ని ముగించమని కెసిఆర్ ఆదేశించారు. సోది చెప్పొద్దని అన్నారు. ఫలితంగా ప్రజల మనోభావాలను కేసీఆర్‌కు తెలియజేయడానికి పార్టీలో కూడా
ఎవరూ సాహసించలేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రయోజనాల కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని చెప్పుకునే కేసీఆర్ మొత్తంగా తన కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని గుర్తించి పనిచేస్తున్నారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అందుకు ఇటీవలే ఎమ్మెల్సీగా కవితను ఎంపిక చేయడం కోసం అనుసరించిన వ్యూహం కూడా గమనించవచ్చు. ఆమె కోసం ఎంపిటిసిలను,జడ్పిటిసిలను భయపెట్టి పార్టీలో చేర్చు కున్నారు. యధారాజా తథా ప్రజా అన్నట్లు కేసీఆర్ నియంతృత్వానికి అలవాటుపడిన మంత్రులు, శాసన సభ్యులు, ఇతర నాయకులు తమ ఇలాకాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలెట్టారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, ముత్తిరెడ్డిల భూ కబ్జాలు ఇందుకు ఉదాహరణలుగా చూడాలి. ప్రజాస్వామ్యంలో నిరంకుశ విధానాలను ఎవరు అవలంబించినా పతనం తప్పదు. అది గుర్తించకపోతే మనుగడ సాగించడం కూడా అంతే కష్టం.