ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలి
– కూటమిలో సీట్లసర్దుబాటుపై చర్చ జరుగుతుంది
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
సంగారెడ్డి, అక్టోబర్15(జనంసాక్షి) : రానున్న ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని, అవినీతికి తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. హుస్నాబాద్‌లోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందస్తు ఎన్నికలు తెచ్చి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారన్నారు. మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాలపై ప్రత్యేక నిఘాపెట్టాలని, ఎన్నికల కవిూషన్ కఠినంగా వ్యవహరించాలని కోరారు. మహాకూటమిలో రెబల్స్ బెడద లేకుండా ఆయాపార్టీలు సమన్వయం చేసుకోవాలని, కిందిస్థాయి క్యాడర్ పూర్తిగా సహకరించాలని కోరారు. సీట్ల సర్ధుబాటుపై చర్చలు జరుగుతున్నాయని, ఇప్పుడే లీకులు ఇవ్వడం మంచిది కాదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే
పని చేస్తామన్నారు. టీఆర్‌ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా మహాకూటమి ఆధ్వర్యంలో అధికారంలోకి రావడం ఖాయమని చాడ జోస్యం చెప్పారు. తెరాస నాలుగేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకే పెద్దపీట వేసిందన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌ల పేరుతో కోట్ల రూపాయలు కవిూషన్ల రూపంలో దోచుకున్నారని చాడ విమర్శించారు. ఎంతోమంది అమరుల ప్రాణత్యాగాలతో, సకలజనుల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగేళ్ల కాలంలోబ్రష్టు పట్టించారని అన్నారు. ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని, దళితులను, ముస్లింలను అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. కేసీఆర్ నాలుగేళ్ల పాలనతో ప్రజలు విసిగి పోయారని, దీంతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారని చాడ తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే రాజిరెడడ్, కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మంద పవన్, ఎడ్ల వెంకట్రాంరెడ్డి, గడిపె మల్లేశ్, కొయ్యడ సృజన్, కూన శోభారాణి, గూడెం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.